MS Dhoni: ధోనీ రిటైర్మెంటుపై క్లారిటీ ఇచ్చిన క్లోజ్ ఫ్రెండ్... బంతి సెలెక్టర్ల కోర్టులో!

  • ధోనీ రిటైర్మెంటుపై విపరీతమైన ప్రచారం
  • ప్రస్తుతం ధోనీకి రిటైరయ్యే ఆలోచనే లేదన్న అరుణ్ పాండే
  • ధోనీ వంటి గొప్ప ఆటగాడిపై ఇలాంటి ప్రచారం దురదృష్టకరమంటూ వ్యాఖ్య

వరల్డ్ కప్ లో టీమిండియా ఓటమి నేపథ్యంలో అందరి దృష్టి మహేంద్ర సింగ్ ధోనీపై పడింది. ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడంటూ కొందరు, ధోనీ ఇప్పట్లో తప్పుకోడని మరికొందరు చెబుతుండడంతో, విండీస్ టూర్ కు ధోనీని ఎంపిక చేయాలో వద్దో తేల్చుకోలేక సెలెక్టర్లు సతమతమవుతున్నారు. అయితే, ధోనీ రిటైర్మెంట్ వ్యవహారంపై అతడి సన్నిహితుడు అరుణ్ పాండే చెబుతున్న వివరాలు సెలెక్టర్లకు పెద్దగా రుచించకపోవచ్చనిపించేలా ఉన్నాయి. ధోనీకి ఇప్పటికిప్పుడు రిటైరయ్యే ఆలోచనేదీ లేదని అరుణ్ పాండే స్పష్టం చేశారు. ధోనీ వంటి గొప్ప ఆటగాడి కెరీర్ పై అదేపనిగా ఊహాగానాలు వస్తుండడం దురదృష్టకరమని పాండే అభిప్రాయపడ్డారు.

ధోనీ రిటైర్మెంటుపై పాండే వ్యాఖ్యలతో కాస్తంత స్పష్టత రావడంతో, ఇప్పుడతడిని విండీస్ టూర్ కు సెలెక్ట్ చేయడమా, వద్దా అనేది సెలెక్టర్ల చేతిలో ఉంది. ఈ నేపథ్యంలో ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ తీసుకునే నిర్ణయంపైనే ధోనీ భవితవ్యం ఆధారపడి ఉంది. కాగా, అరుణ్ పాండే వికెట్ కీపింగ్ దిగ్గజం ధోనీకి చాలాకాలంగా సన్నిహిత మిత్రుడు. ఇద్దరూ కలిసి అనేక వ్యాపారాల్లో భాగస్వాములుగా ఉన్నారు. ధోనీ ఆటలో బిజీగా ఉన్న నేపథ్యంలో, అతని తరఫున వ్యాపారాలు చూసుకునేది అరుణ్ పాండేనే. ఈ నేపథ్యంలో ధోనీ మనసులో మాటనే అరుణ్ పాండే బయటికి వెల్లడించినట్టు అర్థమవుతోంది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News