Nara Lokesh: అసెంబ్లీ సాక్షిగా మరో నవరత్నం జారిపోయింది: నారా లోకేశ్
- రైతు భరోసా పథకంపై ప్రభుత్వాన్ని నిలదీసిన లోకేశ్
- రూ.12,500 ఇస్తామని చెప్పి రూ.6,500తో సరిపెడుతున్నారంటూ విమర్శ
- ఈ మాత్రం దానికి పాదయాత్రలో కూతలు కూయడం ఎందుకంటూ వ్యంగ్యం
వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తన విమర్శలు కొనసాగిస్తున్నారు. చిన్న అవకాశం దొరికినా ట్విట్టర్ వేదికగా విమర్శల జడివాన కురిపిస్తున్నారు. తాజాగా, రైతు భరోసా పథకంలో రైతులకు అందించే నగదులో కోత విధించారంటూ ఆరోపణాస్త్రం సంధించారు. అసెంబ్లీ సాక్షిగా మరో నవరత్నం జారిపోయిందంటూ సెటైర్ వేసిన లోకేశ్, రైతు భరోసా పథకంలో భాగంగా ఏటా రూ.12500 ఇస్తామని చెప్పారని, ఇప్పుడు వెనుకంజ వేస్తూ రూ.6500 మాత్రమే ఇస్తామంటున్నారని విమర్శించారు. ఈ మాత్రం దానికి పాదయాత్రలో కూతలు కూయడం ఎందుకని వ్యంగ్యం ప్రదర్శించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పథకాల్లో కోతలు విధిస్తూ ప్రజలను మోసం చేయడం ఎందుకుని నిలదీశారు.