Telangana: పోలీసు వాహనంపై కూర్చుని తెలంగాణ మంత్రి మనవడి టిక్ టాక్... వివాదం!
- డీజీపీ పేరిట రిజిస్టరైన వాహనంపై మహమూద్ అలీ కుమారుడు
- పోలీసులను బెదిరిస్తూ టిక్ టాక్ వీడియో
- చిన్న ఘటనగా తీసిపారేసిన పోలీసు అధికారులు
తెలంగాణ మంత్రి మహమూద్ అలీ ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఆయన మనవడు ఫుర్ఖాన్ అహ్మద్, మరో యువకుడితో కలిసి పోలీసు వాహనంపై కూర్చుని ఉన్న వీడియో టిక్ టాక్ యాప్ లో ప్రత్యక్షమై వైరల్ కావడమే ఇందుకు కారణం. ఈ వీడియోలో అహ్మద్ పోలీసు వ్యాన్ పై కూర్చుని ఉన్నాడు. వాహనం నంబర్ ప్లేట్ రాష్ట్ర పోలీస్ చీఫ్ పేరిట రిజిస్టరై ఉన్నట్టు తెలుస్తోంది.
తెలంగాణలోని అన్ని పోలీసు వాహనాలూ డీజీపీ పేరిట రిజిస్టరై ఉంటాయన్న సంగతి తెలిసిందే. పోలీసు వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ వాహనాన్ని హోమ్ మినిస్టర్ సెక్యూరిటీ నిమిత్తం కేటాయించారు. మిత్రులిద్దరూ వాహనంపై కూర్చుని ఓ సినిమా డైలాగును చెబుతున్నారు. ఈ డైలాగ్ సినిమాలో పోలీసు అధికారిని బెదిరించే డైలాగుగా వుంది. ప్రవర్తన సరిగ్గా లేకుంటే కంఠాన్ని నరికేస్తానన్న అర్థం వచ్చే డైలాగును వీరు చెబుతున్నారు.
కాగా, ఈ ఘటనను చాలా చిన్న ఘటనగా పోలీసులు తీసుకోవడం గమనార్హం. అహ్మద్ కేవలం పోలీసు వాహనంపై కూర్చున్నాడని అన్నారు. దీనిపై స్పందించిన మహమూద్ అలీ, తాను రెండు రోజుల క్రితం ఓ ఫంక్షన్ కు వెళ్లగా, ఎవరో స్థానికులు ఈ వీడియో తీశారని, దాన్ని పరిశీలిస్తున్నానని చెప్పారు.
గడచిన వారం రోజుల వ్యవధిలో టిక్ టాక్ వీడియో వివాదం కావడం తెలంగాణలో ఇది రెండో సారి. గతవారం ఖమ్మం మునిసిపల్ కార్యాలయంలో ఉద్యోగులు విధులను పక్కనబెట్టి టిక్ టాక్ వీడియోలు చేయగా, అధికారులు చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే.