Chandrababu: పాలన చేతకాకపోతే సమర్థులను సంప్రదించి నేర్చుకోవాలి!: చంద్రబాబు
- హ్యాపీ రిసార్ట్స్ లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చంద్రబాబు భేటీ
- జగన్ సర్కారుపై ధ్వజం
- రాష్ట్ర ప్రజలకు నరకం చూపిస్తున్నారంటూ ఆగ్రహం
ఏపీ ప్రభుత్వ విద్యుత్ విధానంపై మాజీ సీఎం చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. రాజధాని ప్రాంతంలోని హ్యాపీ రిసార్ట్స్ లో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పాలన చేతకాకపోతే సమర్థులను సంప్రదించి నేర్చుకోవాలంటూ సర్కారుకు హితవు పలికారు. అసమర్థ పాలనతో ప్రజలను కష్టాలకు గురిచేస్తున్నారని, విద్యుత్ కోతలతో రాష్ట్ర ప్రజలకు నరకం చూపిస్తున్నారంటూ జగన్ సర్కారుపై చంద్రబాబు మండిపడ్డారు.
టీడీపీ ఐదేళ్ల పాలనలో మిగులు విద్యుత్ ఇచ్చామని, భవిష్యత్తులో విద్యుత్ ధరలు పెరగకుండా జాగ్రత్త వహించామని తెలిపారు. పీపీఏలపై టీడీపీ ప్రభుత్వ విధానాలను కేంద్రం, ఫిచ్ సైతం ప్రశంసించాయని, ఇప్పుడు పీపీఏలపై సమీక్ష చేయాల్సిన అవశ్యకతపై జగన్ సర్కారు వితండవాదం చేస్తోందని ఆరోపించారు. విద్యుత్ విధానాలపై సమాధానం చెప్పలేని పరిస్థితి ప్రభుత్వంలో కనిపిస్తోందని, విద్యుత్ రంగాన్ని ఈ సర్కారు అస్తవ్యస్తం చేస్తోందని చంద్రబాబు అన్నారు.