Chandrababu: చంద్రబాబు ‘వెంట్రిలాక్విస్ట్’గా.. అచ్చెన్నాయుడు ’బొమ్మ’లా ఉన్నారు: అంబటి అభివర్ణన
- అచ్చెన్నాయుడు మితిమీరి ప్రవర్తిస్తున్నాడు
- బోర్డర్ లైన్ దాటి వెళుతున్నాడు
- 'అచ్చెన్నాయుడు గారూ, ఇది తప్పు' అన్న రాంబాబు
ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ పై చర్చలో భాగంగా చంద్రబాబు వ్యాఖ్యలకు జగన్ కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబును ‘విలన్’ గా జగన్ అభివర్ణించడంపై టీడీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తన ప్రసంగానికి అడ్డుతగిలిన టీడీపీ సభ్యుడు అచ్చెన్నాయుడుపై జగన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అనంతరం వైసీపీ సభ్యుడు అంబటి రాంబాబు మాట్లాడుతూ, చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై జగన్ సమాధానం చెబుతుంటే అచ్చెన్నాయుడు అడ్డుతగలడం సబబు కాదని అన్నారు.
‘ఉదయం నుంచి చూస్తున్నా అచ్చెన్నాయుడులో చాలా చిత్రమైన మనిషి కనిపిస్తున్నాడు. కేకలు, రంకెలు వేస్తారు, మైక్ ఇవ్వకుండా మాట్లాడతారు! నాకు ఏమనిపిస్తోందంటే.. వెంట్రిలాక్విజమ్ అనే ఒక సిస్టమ్ ఉంది. చేతిలో బొమ్మ ఉన్న వ్యక్తే మాట్లాడితే, ఆ బొమ్మ యాక్షన్ చేస్తుంది. అట్లాగే, చంద్రబాబునాయుడుగారు వెంట్రిలాక్విస్ట్ గా ఉన్నారు, ఆయన (అచ్చెన్నాయుడు) బొమ్మలా ఉన్నారు. ఆయన మాటలు ఈయన, ఈయన మాటలు ఆయన మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇది చాలా అన్యాయంగా ఉంది. ఆయన (అచ్చెన్నాయుడు) మితిమీరి ప్రవర్తిస్తున్నాడు. బోర్డర్ లైన్ దాటి వెళుతున్నాడు. అచ్చెన్నాయుడు గారూ, ఇది తప్పు, సభా నాయకులు మాట్లాడుతున్నప్పుడు ఇష్టమొచ్చినట్టుగా క్రాస్ టాక్ చేస్తున్నారు. అవసరమైతే, దీనిపై యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది’ అని అంబటి పేర్కొన్నారు.