Nitin Gadkari: డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి ఆధార్ అవసరం లేదు: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
- ఆధార్ ఆధారంగా 1.57 కోట్ల లైసెన్స్ లు ఇచ్చాం
- కోర్టు తీర్పు తరువాత ఆధార్ వినియోగాన్ని నిలిపివేశాం
- రాజ్యసభకు తెలిపిన నితిన్ గడ్కరీ
ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు ఆధార్ కార్డు అవసరం లేదని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. డ్రైవింగ్ లైసెన్స్ కు ఆధార్ కార్డును ఉపయోగించడాన్ని కేంద్రం నిలిపివేసిందని రాజ్యసభకు ఆయన తెలిపారు. గత సంవత్సరం సెప్టెంబర్ 26న అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ప్రకారం ఈ ఆదేశాలు జారీ చేశామని వెల్లడించారు. ఇప్పటి వరకు ఆధార్ కార్డు ఆధారంగా దేశ వ్యాప్తంగా 1.57 కోట్ల డ్రైవింగ్ లైసెన్సులను జారీ చేశామని అన్నారు. ఇదే సమయంలో ఆధార్ ప్రామాణికంగా 1.65 కోట్ల వాహనాలను రిజిస్టర్ చేశామని తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల అనంతరం ఆధార్ ను ధ్రువీకరణకు వినియోగించడాన్ని నిలిపివేశామని తెలిపారు.