Premender Reddy: రైతుల ఉద్యమాన్ని ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉండాలి: బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి

  • బీజేపీకి పేరొస్తుందనే రైతుల డేటాను ఇవ్వట్లేదు
  • రైతులకు నేటికీ పాసు పుస్తకాలు అందివ్వలేదు
  • వర్షాకాలం ప్రారంభమైనా ప్రభుత్వానికి సోయి లేదు
  • రైతు రుణమాఫీ అని చెప్పి మాట తప్పారు

రైతుల ఉద్యమాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని బీజేపీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి హెచ్చరించారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీఆర్ఎస్ వాళ్లు మాత్రమే రాష్ట్రంలో పండుగ చేసుకుంటున్నారని, రైతులు మాత్రం ఇబ్బందుల్లోనే ఉన్నారని పేర్కొన్నారు. రైతుల డేటా ఇస్తే కేంద్రం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద డబ్బులు ఇస్తామని పేర్కొందని, కానీ తెలంగాణ ప్రభుత్వం దానికి సిద్ధంగా లేదన్నారు. బీజేపీకి పేరొస్తుందనే రైతుల డేటాను ఇవ్వట్లేదని ప్రమేందర్ రెడ్డి ఆరోపించారు. భూ సర్వే పేరుతో సర్వేలు నిర్వహించి రైతులకు నేటికీ పాసు పుస్తకాలు అందివ్వలేదని ఆరోపించారు.

అసలు ధరణి వెబ్‌సైట్ ఏమైందో కూడా తెలియదన్నారు. రైతుల పట్ల నిర్లక్ష్యంతో ప్రభుత్వం వ్యవహరిస్తోందని, వర్షాకాలం ప్రారంభమైనా సోయి లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. రైతుబంధు ఎంతమందికి ఇచ్చారనే విషయంలో కూడా స్పష్టత లేదన్నారు. ప్రభుత్వం రైతులకిచ్చిన హామీలన్నీ నీటి మూటలేనని, రైతు రుణమాఫీ అని చెప్పి మాట తప్పారని ప్రేమేందర్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో అవినీతి నానాటికీ పెరుగుతోందని, రెవెన్యూ శాఖే అందుకు ఉదాహరణ అని పేర్కొన్నారు. పేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల మాటను మరచి, కొత్త సచివాలయం, అసెంబ్లీ అంటూ కాలయాపన చేస్తున్నారని ప్రేమేందర్ రెడ్డి మండిపడ్డారు.

  • Loading...

More Telugu News