Rohit Sharma: ప్రపంచకప్‌లో టాప్ స్కోరర్‌గా రోహిత్ శర్మ.. గోల్డెన్ బ్యాట్ దక్కించుకున్న ‘హిట్ మ్యాన్’

  • ఐదు సెంచరీలతో 648 పరుగులు చేసిన రోహిత్
  • రెండు మూడు స్థానాల్లో రూట్, కేన్ విలియమ్సన్
  • సచిన్ సరసన రోహిత్

ఆదివారంతో ప్రపంచకప్ సమరం ముగిసింది. చివరి బంతి వరకు ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్ చివరికి సూపర్ ఓవర్‌కు దారితీసింది. అక్కడా ఉత్కంఠ రాజ్యమేలినా చివరికి విజయం ఇంగ్లండ్‌‌ను వరించింది. ప్రపంచకప్ పుట్టినింట ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. న్యూజిలాండ్ ఆశలు మరోమారు నీరుగారాయి. కాగా, ఈ ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డులకెక్కిన టీమిండియా హిట్‌మ్యాన్ రోహిత్ శర్మకు ‘గోల్డెన్ బ్యాట్’ లభించింది.

ఈ మెగా ఈవెంట్‌లో మొత్తం 9 మ్యాచ్‌లు ఆడిన రోహిత్ శర్మ ఐదు సెంచరీలతో రికార్డులకెక్కాడు. మొత్తం 648 పరుగులతో అగ్రస్థానంలో నిలిచాడు. ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్ 549 పరుగులతో ఆ తర్వాతి స్థానంలో నిలవగా, న్యూజిలాండ్ స్కిప్పర్ కేన్ విలియమ్సన్ 548 పరుగులతో మూడో స్థానంలో నిలిచాడు. నిజానికి నిన్నటి మ్యాచ్‌లో రోహిత్ శర్మను అధిగమించే అవకాశం రూట్, కేన్ విలియమ్సన్‌లకు దక్కినా సరిగ్గా వినియోగించుకోలేకపోయారు. రూట్ ఏడు పరుగులకే అవుటవగా, కేన్ 30 పరుగులు చేసి అవుటయ్యాడు. కాగా, రోహిత్ శర్మ ఖాతాలో మరో రికార్డు కూడా చేరింది. ఓ ప్రపంచకప్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగా రోహిత్ రికార్డులకెక్కాడు. ప్రపంచకప్‌లలో ఆరు సెంచరీలు సాధించిన రెండో క్రికెటర్‌గా సచిన్ సరసన చేరాడు. 

Rohit Sharma
golden bat
world cup
team India
  • Loading...

More Telugu News