Krishna District: క్రికెట్ కోచింగ్ కోసం తాత బీరువాలో రూ.10 లక్షలు నొక్కేసిన మనవడు!
- క్రికెటర్ కావాలని కలలు కన్న యువకుడు
- తాత ఇంటికే కన్నం
- యువకుడి ఘనకార్యం బయటపెట్టిన పోలీసులు
కృష్ణా జిల్లా కంచికచర్లలో ఓ యువకుడు క్రికెటర్ కావాలన్న కోరికతో తప్పుదారిపట్టాడు. క్రికెట్ కోచింగ్ కోసం ఏకంగా దొంగ అవతారమెత్తాడు. అది కూడా తన తాత ఇంటికే కన్నమేశాడు. స్థానిక వసంత కాలనీలో నివసించే షేక్ జానీ భాషాకు మహబూబ్ సుభానీ అనే మనవడు ఉన్నాడు. సుభానీ నేషనల్ లెవల్లో క్రికెటర్ కావాలని కలలు కనేవాడు. కోచింగ్ లో చేరాలంటే డబ్బు అవసరమని భావించి, తన తాత బ్యాంకు నుంచి తెచ్చిన రూ.10 లక్షలపై కన్నేశాడు. కుటుంబ సభ్యులందరూ డాబాపై నిద్రిస్తుండగా, అమ్మమ్మ నుంచి బీరువా తాళాలు తస్కరించి ఆపై బీరువా తెరిచి రూ.10 లక్షలు కొట్టేశాడు.
అనంతరం విజయవాడలో లక్ష రూపాయలకు పైగా వెచ్చించి లేటెస్ట్ మోడల్ ఐఫోన్, రూ.19 వేల విలువైన క్రికెట్ కిట్ కొనుగోలు చేశాడు. విజయవాడ నుంచి మకాం వైజాగ్ కు మార్చి అక్కడ క్రికెట్ కోచింగ్ లో చేరేందుకు ప్రయత్నాలు కొనసాగించాడు. ఇక, కంచికచర్లలోని తాత షేక్ జానీ బాషా నివాసంలో రూ.10 లక్షలు కనిపించకపోవడంతో గగ్గోలు పుట్టింది. బీరువాలో పెట్టిన డబ్బు కనిపించకపోవడంతో షేక్ జానీ బాషా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డబ్బు మిస్సయిన క్షణం నుంచే సుభానీ కనిపించకపోవడంతో పోలీసులు ఆవైపు నుంచి పరిశోధన చేయగా, సుభానీ ఘనకార్యం బయటపడింది. మనవడే దొంగ అని తెలియడంతో షేక్ జానీ బాషా నమ్మలేకపోయాడు.