Kurnool District: నల్లమల అడవుల్లో క్షుద్రపూజలు...నరబలి జరిగిందన్న అనుమానాలు?
- తల, మొండెం వేరైన యువకుడి మృతదేహం లభ్యం
- కాల్వలో పాతిపెట్టిన మృతదేహం
- దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
నల్లమల అడవుల్లో నరబలి జరిగిందన్న అనుమానాలు సంచలనం రేపుతున్నాయి. నంద్యాల-ఒంగోలు ప్రధాన రహదారిలోని సర్వనరసింహస్వామి ఆలయం పరిసరాల్లోని కాలువలో యువకుని మృతదేహం లభించడంతో స్థానికంగా ఆందోళన వ్యక్తమవుతోంది. గుప్త నిధుల కోసం ఎవరో ఈ ఘాతుకానికి ఒడిగట్టి ఉంటారని చెప్పుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే...కర్నూలు జిల్లా సిరువెళ్ల మండలంలోని పచ్చర్ల గ్రామ పరిసరాల్లోని కాలువలో పాతిపెట్టిన ఓ యువకుని అవయవాలు ఈనెల 11న బయటపడిన విషయం తెలిసిందే.
యువకుని మృతదేహం తల, మొండెం వేరుగా ఉండడం, ఎరుపురంగు పూసి ఉండడం, నిమ్మకాయలు, నీలిరంగు అంగి, జీన్స్‌ప్యాంట్, కాలి వేలికి రింగు, చేతికి వెండి ఉంగరం, బెల్టు లభ్యం కావడంతో అనుమానాలు మొదలయ్యాయి. సమీపంలోనే క్షుద్రపూజలు జరిగినట్టు ఆనవాళ్లు కనిపించడంతో గుప్త నిధులకోసం ఎవరైనా నరబలికి పాల్పడి ఉంటారని, యువకుడినే బలిచ్చి పాతిపెట్టారని అనుమానిస్తున్నారు. పోలీసులు రంగంలోకి దిగి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.