Andhra Pradesh: ‘మిమ్మల్ని జైలులో పెడితే తెలుస్తుంది’.. ఏపీ ఉన్నతాధికారులపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు!
- ఓ ఖైదీని విడుదల చేయాలని కోర్టు ఆదేశం
- 4 నెలల తర్వాత తీరిగ్గా విడుదల చేసిన జైళ్లశాఖ
- ఎన్నికల కోడ్ కారణమని వివరణ.. మండిపడ్డ హైకోర్టు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులపై ఏపీ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. తమ ఆదేశాలను అమలు చేయకపోవడంపై స్పందిస్తూ..‘మీకు కారాగార జీవితం ఎలా ఉంటుందో అనుభవంలోకి రావాలి’ అని ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కరణ నేరం కింద వీరిపై ఎందుకు చర్యలు తీసుకోరాదో చెప్పాలని అడిగింది. ఓ ఖైదీని విడుదల చేయాలని తాము ఆదేశించినా, ఎన్నికల కోడ్ సాకుతో అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శించడంపై ధర్మాసనం ఈ మేరకు స్పందించింది.
నెల్లూరులోని సెంట్రల్ జైలులో గని శ్రీనివాసులు అనే వ్యక్తి యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ నేపథ్యంలో అతని కేసును విచారించిన ధర్మాసనం.. గని శ్రీనివాసులు ప్రత్యేక క్షమాభిక్షకు అర్హుడనీ, ఆయన్ను వెంటనే విడుదల చేయాలని ఈ ఏడాది ఏప్రిల్ 9న ఆదేశాలు జారీచేసింది. అయితే దీన్ని పోలీసులు, జైళ్లశాఖ అధికారులు పట్టించుకోలేదు. దీంతో శ్రీనివాసులు సోదరుడు పవన్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో తమ ఆదేశాలను ఎందుకు అమలుచేయలేదో తెలపాలని అప్పటి హోంశాఖ ముఖ్య కార్యదర్శి ఏఆర్ అనూరాధ, జైళ్లశాఖ డైరెక్టర్ జనరల్ వినయ్‌రంజన్, నెల్లూరు సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రవికిరణ్‌కు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.
దీంతో విచారణకు హాజరైన ఈ అధికారులు.. ఎన్నికల కోడ్ కారణంగా జూలై 4న శ్రీనివాసులును విడుదల చేశామని కోర్టుకు చెప్పారు. దీంతో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్, జస్టిస్ ఎం సత్య నారాయణమూర్తిల ధర్మాసనం అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు తమ ఉత్తర్వులకు ఎన్నికల కోడ్ ఎలా వర్తిస్తుందని ఏపీ హైకోర్టు ప్రశ్నించింది. ‘కారాగార జీవితం ఎలా ఉంటుందో మీకు అనుభవంలోకి రావాల్సిన అవసరం ఉంది’ అని అధికారులను ఉద్దేశించి ఘాటుగా వ్యాఖ్యానించింది. ఎన్నికల కోడ్ కారణంగా విడుదల చేయలేదన్న వ్యాఖ్యలకే కట్టుబడి ఉండాలనీ, మరోమాటకు తావు లేదని ధర్మాసనం స్పష్టం చేసింది.