Andhra Pradesh: గుంటూరులో దారుణం.. టీడీపీ కార్యకర్త కుటుంబంపై వైసీపీ శ్రేణుల దాడి!
- జిల్లాలోని నాదెండ్ల మండలం తూబాడులో ఘటన
- అంకమ్మ అనే టీడీపీ కార్యకర్త ఇంటి ముందు గొయ్యి తవ్వకం
- అడ్డుకున్నందుకు రెచ్చిపోయిన వైసీపీ నేత గడిపూడి నీలాంబరం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసినప్పటికీ అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య ఇంకా ఘర్షణాత్మక వాతావరణం కొనసాగుతోంది. తాజాగా ఏపీలోని గుంటూరు జిల్లాలో కొందరు వైసీపీ కార్యకర్తలు టీడీపీ మద్దతుదారులపై దాడికి పాల్పడ్డారు. ఓ స్థలం విషయంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చెలరేగడంతో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు టీడీపీ మద్దతుదారుడి ఇంటిపై దాడిచేశారు. దీంతో వారికి గాయాలయ్యాయి.
జిల్లాలోని నాదెండ్ల మండలం తూబాడు గ్రామంలో అంకమ్మ అనే టీడీపీ మద్దతుదారు తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీకి చెందిన గడిపూడి నీలాంబరం, ఆయన అనుచరులు ఈరోజు తనపై దాడికి పాల్పడినట్లు అంకమ్మ తెలిపారు. ‘వైసీపీకి చెందిన గడిపూడి నీలాంబరం, ఆయన అనుచరులు 10 మంది మా ఇంటి ముందు గొయ్యి తవ్వడం మొదలుపెట్టారు. ఇలా ఎందుకు చేస్తున్నారని నిలదీయగా.. మా ఇష్టం. ప్రభుత్వం మాది. నీకు దిక్కున్నచోట చెప్పుకో’ అని సమాధానమిచ్చారు.
ఈ గుంత తవ్వకాన్ని అడ్డుకోవడంతో నీలాంబరం, ఆయన అనుచరులు నాపై గడ్డపార, గొడ్డలితో దాడిచేశారు. అడ్డువచ్చిన మా కుటుంబ సభ్యులపై కూడా దాడికి తెగబడ్డారు’ అని బాధితుడు వాపోయారు. కాగా, ఈ ఘటనలో గాయపడ్డ ముగ్గురిని చిలకలూరిపేట ఆసుపత్రికి, తీవ్రంగా గాయపడ్డ ఇద్దరిని గుంటూరు జీజీహెచ్ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.