Andhra Pradesh: ఏపీలో ఇకపై అన్ని ప్రభుత్వ స్కూళ్లు ఇంగ్లిష్ మీడియమే.. తెలుగు సబ్జెక్టును తప్పనిసరి చేస్తాం!: బుగ్గన రాజేంద్రనాథ్
- ఏపీ బడ్జెట్ 2019-20 ను ప్రవేశపెట్టిన మంత్రి
- బీసీ లకు వైఎస్సార్ కల్యాణ కానుక కింద రూ.300 కోట్లు
- షాదీ కా తోఫా కింద రూ.100 కోట్లు జారీ
ఏపీలోని ప్రభుత్వ పాఠశాలలు అన్నింటిని ఇంగ్లిష్ మీడియం స్కూళ్లుగా మారుస్తామని ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. అదే సమయంలో రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో తెలుగు సబ్జెక్టును తప్పనిసరి చేస్తామని వ్యాఖ్యానించారు. ఏపీ అసెంబ్లీలో 2019-20 బడ్జెట్ ను బుగ్గన ఈరోజు ప్రవేశపెట్టారు. అనంతరం మాట్లాడుతూ.. బీసీలకు వైఎస్సార్ కల్యాణ కానుక కింద రూ.300 కోట్లు అందిస్తున్నామని తెలిపారు.
ఎస్సీలకు కల్యాణ కానుక కింద రూ.200 కోట్లు కేటాయించామన్నారు. ఎస్టీలకు గిరిపుత్రిక కల్యాణ కానుక కింద రూ.45 కోట్లు కేటాయించామని చెప్పారు. ముస్లిం మైనారిటీకు షాదీ కా తోఫా కింద రూ.100 కోట్లు ఇస్తున్నామన్నారు. కులాంతర వివాహాలు చేసుకునేవారిని ప్రోత్సహించేందుకు రూ.36 కోట్లను 2019-20 బడ్జెట్ లో కేటాయించామని మంత్రి బుగ్గన అన్నారు.