Andhra Pradesh: సీఎం జగన్ ఇంటిని ముట్టడిస్తామన్న రేషన్ డీలర్లు.. భారీగా మోహరించిన పోలీసులు!
- రేషన్ డీలర్లు ఎక్కడికక్కడ అరెస్ట్
- డ్వాక్రా మహిళలను కూడా వెనక్కి పంపుతున్న పోలీసులు
- ఇంటికి రేషన్ డోర్ డెలివరీ చేస్తామని ప్రకటించిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ లో రేషన్ డీలర్ల వ్యవస్థకు బదులుగా ఇంటికే రేషన్ సరుకులను సరఫరా చేస్తామని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ ఉపాధిపై స్పష్టత ఇవ్వాలనీ, లేదంటే సీఎం జగన్ ఇంటిని ఈరోజు ముట్టడిస్తామని రేషన్ డీలర్లు ప్రకటించారు. దీనికితోడు తమ వేతనాలను పెంచాలని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా సీఎం ఇంటి వద్ద ఆందోళనకు దిగారు.
ఈ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు ముఖ్యమంత్రి నివాసం వద్ద భారీగా బలగాలను మోహరించారు. ముఖ్యమంత్రి నివాసమున్న ప్రాంతంలో సెక్షన్ 30 విధించారు. కృష్ణానది వారధి ప్రాంతం నుంచి వస్తున్నవారిని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుని అరెస్ట్ చేస్తున్నారు. అలాగే వినతిపత్రాలు ఇచ్చేందుకు వస్తున్న డ్వాక్రా సంఘాల మహిళలను కూడా మరోసారి రావాలని వెనక్కు పంపుతున్నారు.