BJP: కన్నా గారూ, తానా వివాదంలో మీకెవరో తప్పుడు సమాచారం ఇచ్చారు... వాస్తవాలు తెలుసుకోండి: నారా లోకేశ్
- తానా వేడుకల్లో రామ్ మాధవ్ ప్రసంగానికి అడ్డుతగిలిన ఎన్నారైలు
- లోకేశ్ గ్యాంగ్ పనే అంటూ బీజేపీ ఆరోపణలు
- బదులిచ్చిన లోకేశ్
అమెరికాలో తానా మహాసభల్లో బీజేపీ నేత రామ్ మాధవ్ ప్రసంగాన్ని తెలుగు ఎన్నారైలు అడ్డుకోవడం కాషాయదళంలో తీవ్ర ఆగ్రహాన్ని రగిల్చింది. దీనిపై ఆ పార్టీ నాయకులు కొందరు ఘాటుగా స్పందించారు. నారా లోకేశ్ గ్యాంగ్ దీనికి కారణం అంటూ ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా ఆరోపణలు చేశారు. దీనికి నారా లోకేశ్ తాజాగా బదులిచ్చారు.
తానా వేడుకల్లో జరిగిన వివాదానికి తానెలా బాధ్యుడ్ని అవుతానో కన్నా లక్ష్మీనారాయణ గారే చెప్పాలంటూ లోకేశ్ ట్వీట్ చేశారు. తానా వివాదానికి తనను కారకుడిగా కన్నా లక్ష్మీనారాయణ పేర్కొనడం ఆశ్చర్యం కలిగించిందని పేర్కొన్నారు. "కన్నా గారూ, మీరు ఎంతో సీనియర్ రాజకీయనాయకులు. ఎవరో చెప్పిన తప్పుడు సమాచారం విని ఇలా వ్యాఖ్యానించారు. జరిగినదాన్ని వక్రీకరించారన్న విషయం కనీసం ఇప్పుడైనా తెలుసుకునేందుకు ప్రయత్నించండి" అంటూ హితవు పలికారు.