Andhra Pradesh: పారిశ్రామికవేత్త రాంప్రసాద్ హత్యకేసులో కీలక సమాచారం రాబట్టిన పోలీసులు!
- కోగంటి సత్యం పాత్రపై బలపడుతున్న అనుమానాలు
- శ్యామ్ భార్యకు రూ.30 లక్షలు ఇచ్చిన సత్యం!
- ఆర్నెల్ల క్రితమే హత్యకు ప్లాన్
హైదరాబాద్ లో దారుణంగా హత్యకు గురైన పారిశ్రామికవేత్త రాంప్రసాద్ హత్యకేసులో విచారణ వేగవంతం చేశారు. రాంప్రసాద్ ను తానే చంపానని, అతడి హింసను తట్టుకోలేకే హత్యచేశానని శ్యామ్ అనే వ్యక్తి తెరపైకి వచ్చినా, ఇందులో కోగంటి సత్యం పాత్రపై అనుమానాలు బలపడుతున్నాయి. టాస్క్ ఫోర్స్ పోలీసుల విచారణలో సంచలన సమాచారం బయటికొస్తోంది. ఇందులో కోగంటి సత్యం పాత్రపై పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. కోగంటి సత్యంకు చెందిన ఐదు సెల్ ఫోన్లను సీజ్ చేశారు.
రాంప్రసాద్ హత్యకు ఆర్నెల్ల క్రితమే ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. కోగంటి సత్యం అనుచరుడు పంజాగుట్టలో నెలరోజుల ముందే గది అద్దెకు తీసుకున్నాడు. హత్య తర్వాత పథకం ప్రకారమే మీడియా ముందుకు నిందితులను పంపినట్టు అనుమానిస్తున్నారు. రాంప్రసాద్ ను హత్యచేస్తే ఆర్థిక ఇబ్బందులు లేకుండా చేస్తానని శ్యామ్ కు కోగంటి సత్యం హామీ ఇచ్చినట్టు భావిస్తున్నారు. హత్యకు 10 రోజుల ముందు శ్యామ్ భార్యకు కోగంటి సత్యం రూ.30 లక్షలు ఇచ్చినట్టు తెలుస్తోంది.
సత్యం, రాంప్రసాద్ మధ్య ఆర్థికపరమైన వివాదాలే ఈ ఘాతుకానికి కారణం అని పోలీసులు విశ్వసిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో దేవాదాయ భూములు కొనేందుకు రాంప్రసాద్ రూ.2 కోట్లు వెచ్చించగా, కంపెనీ డబ్బులు వాడుకున్నారంటూ కోగంటి సత్యం ఆరోపించినట్టు సమాచారం. వీరిద్దరి మధ్య మనస్పర్ధలు తీవ్రస్థాయికి చేరడానికి ఈ అంశమే ప్రధానకారణమని గుర్తించారు.