Andhra Pradesh: టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాంకు ఇద్దరు భార్యలు.. కానీ అఫిడవిట్ లో ఒక్కరినే ప్రస్తావించారు!: ఆమంచి కృష్ణమోహన్
- నలుగురు పిల్లలుంటే ముగ్గురేనని అఫిడవిట్ లో చెప్పారు
- అందుకే ఏపీ హైకోర్టును ఆశ్రయించాను
- విజయవాడలో మీడియాతో వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్
టీడీపీ నేత, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తప్పుడు అఫిడవిట్ సమర్పించారని వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఆరోపించారు. కరణం బలరాం తన ఎన్నికల అఫిడవిట్ లో ఓ భార్య వివరాలనే బయటపెట్టారని ఆమంచి తెలిపారు. కానీ కరణం బలరాంకు మరో భార్య, కుమార్తె ఉన్నారనీ, ఈ విషయాన్ని దాచిపెట్టారని విమర్శించారు.
అలాగే ఆయనకు నలుగురు పిల్లలు ఉంటే, ముగ్గురి పేర్లను మాత్రమే అఫిడవిట్ లో పెట్టారని దుయ్యబట్టారు. ఈ విషయమై తాను ఏపీ హైకోర్టులో ఈపీ(ఎలక్షన్ పిటిషన్) దాఖలు చేశానని వెల్లడించారు. విజయవాడలోని వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆమంచి, తన ఆరోపణలకు సంబంధించిన సాక్ష్యాలను మీడియా ముందు ప్రదర్శించారు. కరణం బలరాంపై అనర్హత వేటు వేయాల్సిందిగా కోర్టును పిటిషన్ లో కోరినట్లు ఆమంచి చెప్పారు.