Swamy Dattatrey Swarupnath: ముస్లిం మహిళలను మసీదుల్లోకి అనుమతించాలంటూ హిందూ మహాసభ దాఖలు చేసిన పిటిషన్ తిరస్కరణ
- హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేసిన స్వామి దత్తాత్రేయ
- అనుమతించకపోవడమంటే అన్యాయం చేసినట్టే
- మహిళల సమానత్వ హక్కును నిరాకరించడమే
ముస్లిం మహిళలను మసీదుల్లోకి అనుమతించాలని కోరుతూ అఖిల భారత హిందూ మహాసభ పిటిషన్ దాఖలు చేసింది. దీనిని నేడు భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం తోసిపుచ్చింది. అఖిల భారత హిందూ మహాసభ కేరళ అధ్యక్షుడు స్వామి దత్తాత్రేయ స్వరూప్ నాథ్ ఈ పిటిషన్ను దాఖలు చేశారు. ముస్లిం మహిళలను మసీదుల్లోకి అనుమతించకపోవడమంటే వారికి పురుషులు అన్యాయం చేసినట్టేని, అంతేకాకుండా సమానత్వ హక్కును నిరాకరించడమేనని దత్తాత్రేయ పిటిషన్లో పేర్కొన్నారు.
అయితే ఆయన గతంలో కేరళ హైకోర్టులో ఇదే విషయమై పిటిషన్ దాఖలు చేయడంతో, ప్రచారం కోసమే పిటిషన్ దాఖలు చేసినట్టు కనిపిస్తోందంటూ తీర్పులో భాగంగా కేరళ హైకోర్టు వ్యాఖ్యానించింది. దీంతో దత్తాత్రేయ సుప్రీంకోర్టులో ఈ తీర్పును సవాల్ చేశారు. నేడు ఈ పిటిషన్పై విచారణ నిర్వహించిన సుప్రీంకోర్టు, ముస్లిం మహిళలు ఎవరైనా ఈ విషయమై సవాలు చేస్తే ఈ అంశాన్ని పరిశీలిస్తామని స్పష్టం చేసింది.