cat missing: తప్పిపోయిన తమ 'పిల్లి' కోసం 25 రోజులుగా వెతుకుతున్న గుజరాత్ జంట!
- పెంపుడు పిల్లితోపాటు తిరుపతి వచ్చిన దంపతులు
- రేణిగుంట రైల్వేస్టేషన్లో అదృశ్యమైన మార్జాలం
- దీంతో నాలుగు వారాలుగా చుట్టుపక్కల అన్వేషిస్తున్న భార్యాభర్తలు
మానవత్వానికి అవధుల్లేవు. మూగజీవాలతో అనుబంధానికి హద్దులు ఉండవు. ఇందుకు ఈ జంట తీరు ఉదాహరణ. తమ పెంపుడు పిల్లి తప్పిపోవడంతో ఏకంగా ఇరవై ఐదు రోజుల నుంచి తమ ఊరుకాని ఊరు తిరుపతిలో తిష్టవేసి దానికోసం అన్వేషిస్తున్న ఈ జంట అభిమానాన్ని చూసి తెలిసిన వారు అచ్చెరువొందుతున్నారు.
వివరాల్లోకి వెళితే...గుజరాత్ రాష్ట్రం సూరత్ నగరానికి చెందిన జయేష్బాయి, మీనా బెన్ దంపతులు. జూన్ 9వ తేదీన వీరు శ్రీవేంకటేశ్వరుని దర్శనం కోసం తిరుపతి వచ్చారు. తమతోపాటు తాము అల్లారుముద్దుగా పెంచుకున్న పిల్లి (బాబు)ని ప్రత్యేక ప్లాస్టిక్ బుట్టలో ఉంచి తెచ్చారు. తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం గత నెల 13వ తేదీన తిరుగు ప్రయాణం కోసం రేణిగుంట రైల్వేస్టేషన్‌కి చేరుకున్నారు. అక్కడ గుర్తు తెలియని వ్యక్తులు వీరి పిల్లిని ఎత్తుకు పోయారు.
దీంతో అప్సెట్ అయిన దంపతులు వెంటనే రేణిగుంట రైల్వే పోలీసుకు ఫిర్యాదు చేయగా వారు దాన్ని స్వీకరించేందుకు నిరాకరించారు. దీంతో దంపతులు తామే స్వయంగా పిల్లిని వెతకడం ప్రారంభించారు. దాదాపు నాలుగు వారాలుగా రేణిగుంట, తిరుపతి, తిరుమల, తిరుచానూరు తదితర ప్రాంతాల్లో తిరుగుతూ పిల్లి ఆచూకీ కోసం అన్వేషిస్తున్నారు. తమ పిల్లిని ఎవరైనా గుర్తిస్తే 9824876542 నంబర్‌కు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.