Sri Lanka: భారత్-శ్రీలంక మ్యాచ్‌ను వీక్షించిన ఐసీసీ నిషేధిత క్రికెటర్ సనత్ జయసూర్య
- ఐసీసీ కోడ్‌ను ఉల్లంఘించినట్టు స్వయంగా అంగీకరించిన మాజీ కెప్టెన్
- జయసూర్యపై రెండేళ్ల నిషేధం
- ఆటగాళ్లను, అధికారులను కలవలేదన్న ఐసీసీ
ఐసీసీ నిషేధిత శ్రీలంక క్రికెటర్ సనత్ జయసూర్య లీడ్స్‌లో దర్శనమిచ్చాడు. ప్రపంచకప్‌లో భాగంగా శనివారం భారత్-శ్రీలంక మధ్య లీడ్స్‌లోని హెడింగ్లీ క్రికెట్ గ్రౌండ్లో జరిగిన మ్యాచ్‌ను జయసూర్య స్టాండ్స్‌లో కూర్చుని వీక్షించాడు. జయసూర్యతో పాటు శ్రీలంక మాజీ కెప్టెన్ అరవింద డిసిల్వా కూడా మ్యాచ్ చూసేందుకు వచ్చాడు.
ఐసీసీ యాంటీ కరెప్షన్ కోడ్ 2.4.6, 2.4.4 ఆర్టికల్‌ను ఉల్లంఘించి అవినీతికి పాల్పడినట్టు అంగీకరించిన జయసూర్యపై ఐసీసీ రెండేళ్ల పాటు నిషేధం విధించింది. నిషేధ సమయలో క్రికెట్‌తో సంబంధం ఉన్న ఎటువంటి కార్యక్రమాల్లోనూ పాల్గొనకూడదు. ఈ విషయమై ఐసీసీ గవర్నింగ్ బాడీ అధికార ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ఆటగాళ్ల వద్దకు కానీ, అధికారుల వద్దకు కానీ జయసూర్య వెళ్లలేదని పేర్కొన్నారు.