Bangladesh: తల్లీ నీకో నమస్కారం, ఆ పదాన్ని మరోలా పలకొద్దు... ఓ మహిళా రిపోర్టర్ పై పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ తీవ్ర అసహనం!
- బంగ్లాదేశ్ ను 'బెంగాలీస్' అని పలికిన రిపోర్టర్
- 'బెంగాలీస్' అంటే వివాదం అవుతుందన్న సర్ఫరాజ్
- దయచేసి అలా పలకొద్దంటూ హితవు
వరల్డ్ కప్ లీగ్ దశ ముగియడంతో ఇంగ్లాండ్ నుంచి స్వదేశానికి చేరుకున్న పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ కరాచీలో మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా ఓ మహిళా రిపోర్టర్ అడిగిన ప్రశ్న సర్ఫరాజ్ ను అసహనానికి గురిచేసింది. పాక్ సీనియర్ ఆటగాడు షోయబ్ మాలిక్ 'బెంగాలీస్' తో మ్యాచ్ తర్వాత వన్డే క్రికెట్ కు వీడ్కోలు పలికితే, అతడికి సరైన రీతిలో వీడ్కోలు కార్యక్రమం ఎందుకు ఏర్పాటు చేయలేదని ఆ లేడీ రిపోర్టర్ ప్రశ్నించింది. ఆమె బంగ్లాదేశ్ ను 'బెంగాలీస్' అని పిలవడం పట్ల సర్ఫరాజ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు.
"దయచేసి 'బెంగాలీస్' అనే పదాన్ని ఉపయోగించవద్దు. మీరా పదాన్ని 'బంగ్లాదేశ్' అనే పలకాలి. మీరు 'బెంగాలీస్' అని పిలిస్తే సోషల్ మీడియాలో విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. 'బంగ్లాదేశ్' ను 'బెంగాలీస్' అంటే అదో పెద్ద వివాదం అవుతుంది, ఎందుకొచ్చిన గొడవ!" అంటూ హితవు పలికాడు. షోయబ్ మాలిక్ తమ జట్టులో అత్యంత సీనియర్ ఆటగాడని, కానీ అతని కెరీర్ లో ఓ వరల్డ్ కప్ లేకపోవడం తీరని లోటు అని సర్ఫరాజ్ పేర్కొన్నాడు. దేశానికి ఎనలేని సేవలు అందించిన షోయబ్ జట్టులో ఉండడాన్ని తామెంతో ఆస్వాదించామని చెప్పాడు.