icc world cup: ఉపయోగం లేని మ్యాచ్‌లో గెలిచిన సౌతాఫ్రికా.. మారిన సెమీస్ సమీకరణాలు

  • ముగిసిన లీగ్ మ్యాచ్‌లు
  • దక్షిణాఫ్రికాపై ఆసీస్ ఓటమి
  • భారత్ సెమీస్ ప్రత్యర్థి న్యూజిలాండ్

ప్రపంచకప్‌లో లీగ్ దశ ముగిసింది. శనివారం భారత్-శ్రీలంక, ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా మధ్య చివరి లీగ్ మ్యాచ్‌లు జరిగాయి. శ్రీలంకపై  భారత్ విక్టరీ సాధించగా, గెలిచినా ఉపయోగం లేని మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా విజయం సాధించి ఆస్ట్రేలియాను పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి దించింది. దీంతో సెమీస్ సమీకరణాలు మారిపోయాయి.

మాంచెస్టర్‌లో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా తొలి బంతి నుంచే విరుచుకుపడింది. డుప్లెసిస్ అద్భుత సెంచరీకి తోడు మార్కరమ్ (34), క్వింటన్ డికాక్ (52), డుసెన్ (95) రాణించడంతో దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 325 పరుగులు చేసింది.

అనంతరం 326 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఆసీస్.. వార్నర్ (122) సెంచరీతో చెలరేగినప్పటికీ విజయం ముంగిట బోల్తాపడింది. చివరల్లో అలెక్స్ కేరీ 85 పరుగులతో విజయంపై ఆశలు రేపినప్పటికీ సఫారీ బౌలర్ల ముందు నిలవలేకపోయాడు. ఫలితంగా 315 పరుగులకే ఆలౌటై విజయానికి 10 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.

ఈ ఓటమితో ఆస్ట్రేలియా పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి దిగజారింది. మరోవైపు శ్రీలంకపై గెలిచిన భారత్ 15 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకుంది. దీంతో సెమీస్‌లో ఎవరు ఎవరితో తలపడతారన్న దానిపై క్లారిటీ వచ్చింది. భారత్-న్యూజిలాండ్, ఆస్ట్రేలియా-ఇంగ్లండ్‌లు సెమీస్‌లో తలపడనున్నాయి. ఈ నెల 9న మాంచెస్టర్‌లో జరిగే తొలి సెమీస్‌లో భారత్-కివీస్‌లు తలపడనుండగా, 11న బర్మింగ్‌హామ్‌లో ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ జట్లు ఫైనల్ బెర్త్ కోసం పోటీ పడనున్నాయి.

icc world cup
India
Sri Lanka
Australia
new zealand
england
  • Loading...

More Telugu News