Andhra Pradesh: 40 రోజుల్లో ఆరుగురు టీడీపీ కార్యకర్తల్ని చంపేశారు!: టీడీపీ అధినేత చంద్రబాబు
- వైసీపీ నేతలు దాడులు, దౌర్జన్యాలకు దిగుతున్నారు
- పార్టీ శ్రేణులకు అన్ని విధాలుగా అండగా ఉంటాం
- ఉండవల్లిలో టీడీపీ నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
గత 40 రోజుల్లో ఆరుగురు తెలుగుదేశం కార్యకర్తలను చంపేశారని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. అన్నిచోట్ల వైసీపీ అరాచకాలు పెరిగిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ కార్యకర్తలపై దాడులు, దౌర్జన్యాలను ఖండిస్తున్నామని చెప్పారు. ఊర్లను ఖాళీ చేసి వెళ్లాలని టీడీపీ శ్రేణులను వైసీపీ నేతలు బెదిరిస్తున్నారనీ, ఇళ్లపై సామూహిక దాడులు చేస్తున్నారని దుయ్యబట్టారు. చివరికి పొలాలను కూడా సాగు చేయనివ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉండవల్లిలో టీడీపీ నేతలతో ఈరోజు నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్ లో చంద్రబాబు మాట్లాడారు.
టీడీపీ హయాంలో నిర్మించిన అంగన్ వాడీ కేంద్రాలను కూల్చేస్తున్నారనీ, రోడ్లను తవ్వేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన అరాచక శక్తులు పేట్రేగుతున్న నేపథ్యంలో కార్యకర్తలకు అండగా ఉండేందుకే ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తున్నానని తెలిపారు. పార్టీ కార్యకర్తలు, నాయకులకు అన్నివిధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలో చంద్రశేఖర్‌ను, తాడిపత్రిలో భాస్కర రెడ్డిని, బత్తలపల్లి మండలం పత్యాపురంలో రాజప్పను, మంగళగిరిలో ఉమా యాదవ్‌ను, కర్నూలు జిల్లా డోన్ మండలం కొప్పల కొత్తూరులో శేఖర్‌రెడ్డిని కిరాతకంగా హత్యచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గం చినగంజాం మండలం రుద్రమాంబ పురంలో టీడీపీ మహిళా కార్యకర్త పద్మను దారుణంగా అవమానించడంతో ఆమె ప్రాణాలు తీసుకుందని విచారం వ్యక్తం చేశారు. ఈ హత్య.. ఈ పాపం.. శాపంగా మారి వైసీపీని పతనం చేస్తుందని చంద్రబాబు హెచ్చరించారు.