Andhra Pradesh: వైసీపీ నేతలు రోడ్లపై బోర్లు వేస్తున్నారు.. ప్రజల నుంచి కలెక్షన్లు వసూలు చేస్తున్నారు!: భూమా అఖిలప్రియ
- అభివృద్ధి లేకపోవడంతోనే టీడీపీలోకి వచ్చాం
- పార్టీలో చేరాక నోట్ల కట్టలు ఏమీ రాలేదు
- యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో టీడీపీ నేత
నంద్యాల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేని పరిస్థితుల్లోనే తాము వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లామని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ తెలిపారు. టీడీపీలోకి చేరాక తమకు నోట్ల సంచులు ఏమీ రాలేదని స్పష్టం చేశారు. ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అఖిలప్రియ మాట్లాడుతూ..‘టీడీపీలో చేరాక మాకు ఎలాంటి డబ్బులు రాలేదు.
మా నాన్న బతికి ఉన్నప్పుడే నంద్యాలలో 10,000 మందికి ఇళ్లు ఇవ్వడానికి, రోడ్డు వెడల్పు కోసం సీఎం చంద్రబాబు ఒప్పుకున్నారు. నాన్న చనిపోయాక నేను స్వయంగా సీఎం దగ్గరకు వెళ్లి ఈ విషయంలో మాట తీసుకున్నా. భూమా నాగిరెడ్డి చనిపోతారని ఎవ్వరూ ఊహించలేదు. నాపై ఏ ఒక్కరూ వేలెత్తి చూపకుండా రాజకీయం చేశాను’ అని తెలిపారు.
నీరు-చెట్టు పథకంలో ఆళ్లగడ్డలో తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని అఖిలప్రియ స్పష్టం చేశారు. ఎవరో ఫిర్యాదు చేయడంతో విజిలెన్స్ అధికారులు 3 నెలలు పని ఆపేసి తనిఖీలు చేశారనీ, ఎలాంటి సాక్ష్యాలు దొరకలేదని తెలిపారు. ‘వైసీపీ వాళ్లు గెలిచి 2-3 నెలలు కాలేదు. రోడ్డుపై బోర్లు వేస్తున్నారు. ఇందుకు కమిషన్ వసూలు చేస్తున్నారు. కలెక్షన్లు చేస్తున్నారు. 25 శాతం లోపు పూర్తయిన కాంట్రాక్టర్ల పనులను ఆపేయాలని ఆదేశించారు’ అని అఖిలప్రియ ఆరోపించారు.