Almatti: ఈ సీజన్ లో తొలిసారి... ఆల్మట్టికి మొదలైన వరద!
- 16 వేల క్యూసెక్కుల వరద
- గోదావరిలో 5 వేల క్యూసెక్కులు
- భారీ వర్షాలు కురిస్తేనే దిగువకు నీరు
తెలుగు రాష్ట్రాలకు వరప్రదాయినైన కృష్ణా నదికి ఈ సీజన్ లో తొలిసారిగా వరద ప్రారంభమైంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో ఆల్మట్టి రిజర్వాయర్ వద్ద 16 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో నమోదైంది. గత నెల 20 నుంచి కర్ణాటకలో అడపాదడపా వర్షాలు కురుస్తున్నా, ఆ నీరు ఎండకు వేడెక్కిపోయిన భూతాపాన్ని చల్లార్చేందుకు మాత్రమే సరిపోయింది. ఇక నైరుతి రుతుపవనాలు వచ్చిన తరువాత ఆల్మట్టికి వరద మొదలైంది.
ఇదే సమయంలో కృష్ణమ్మకు ఉపనదిగా ఉన్న భీమా నదిలో 4 వేల క్యూసెక్కులకు పైగా వరద ప్రవహిస్తోంది. ఎగువన భారీ వర్షాలు కురిస్తే తప్ప ఇప్పట్లో ఆల్మట్టి నిండే అవకాశం లేదు. ఆల్మట్టి జలాశయం నిండితేనే దిగువకు నీరు వస్తుంది. ఇదిలావుండగా, గోదావరి ఎగువన కురుస్తున్న వర్షాలకు కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద నదిలో నీటిమట్టం పెరిగింది. గోదావరిలో 5 వేల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోందని, నదిలో 3.50 మీటర్ల నీటిమట్టం ఉందని అధికారులు పేర్కొన్నారు.