Hyderabad: కాచిగూడ టీఆర్ఎస్ కార్పొరేటర్ ఎక్కా చైతన్యపై అనర్హత వేటు
- ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఆమెకు ముగ్గురు సంతానం
- ఈ విషయమై కోర్టులో పిటిషన్
- కార్పొరేటర్ గా కొనసాగనున్న ఉమాదేవీ రమేశ్ యాదవ్
హైదరాబాద్ లోని కాచిగూడ టీఆర్ఎస్ కార్పొరేటర్ ఎక్కాల కన్నా చైతన్యపై అనర్హత వేటు పడింది. కోర్టు విచారణ సమయంలో కన్నా చైతన్య తనకు ముగ్గురు సంతానం ఉన్నారన్న విషయాన్ని దాచిపెట్టినట్టు తేలింది. దీంతో, ఆమెపై అనర్హత వేటు వేస్తున్నట్టు నాంపల్లి కోర్టు ఈరోజు తీర్పునిచ్చింది. రెండో స్థానంలో ఉన్న బీజేపీ నాయకురాలు ఉమాదేవీ రమేశ్ యాదవ్ ను కార్పొరేటర్ గా కొనసాగించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
కాగా, ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా కన్నా చైతన్యకు ముగ్గురు సంతానం ఉన్నారని ఉమాదేవీ భర్త రమేశ్ యాదవ్ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై న్యాయస్థానం ఈరోజు విచారణ జరిపింది. ఇదిలా ఉండగా, ఉమాదేవీ రమేశ్ యాదవ్ ను కార్పొరేటర్ గా కొనసాగించాలన్న కోర్టు తీర్పుతో బీజేపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు.