YSRCP: అందుకే, జగన్ కు ఇందిరమ్మ ఇళ్ల అవకతవకలపై అవగాహన లేదు: నారా లోకేశ్
- గతంలో జగన్ క్విడ్ ప్రోకోలో బిజీ
- ‘ఇందిరమ్మ’ అవినీతి గురించి బొత్సను అడగాల్సింది
- ‘పేదల ఇళ్ల నిర్మాణంలో అవినీతికి పరాకాష్ఠ అది
ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత నారా లోకేశ్ వరుస ట్వీట్లతో విరుచుకుపడ్డారు. గతంలో జగన్ క్విడ్ ప్రోకోలో బిజీ కనుక ఆయనకు ఇందిరమ్మ ఇళ్ల అవకతవకల గురించి అవగాహన ఉండకపోవచ్చని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నేటి సమీక్షలో జగన్ తో పాటు కూర్చున్న బొత్స సత్యనారాయణను ఇందిరమ్మ ఇళ్ల గురించి అడిగి ఉంటే, పద్నాలుగు లక్షల ఇళ్లను కట్టకుండానే బిల్లులు తీసుకున్న అవినీతి గురించి వివరించేవారని సెటైర్లు విసిరారు.
2014కు ముందు రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్లు కట్టేందుకు రూ.11 వేల కోట్లు కేటాయించి, అందులో రూ.7759 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, అందులోనూ లబ్ధిదారులకు రూ. 3,500 కోట్లు ఖర్చుపెట్టి మిగతా రూ.4,150 కోట్లు దోపిడీ చేశారని ఆరోపించారు. ‘పేదల ఇళ్ల నిర్మాణంలో అవినీతికి పరాకాష్ఠ అది’ అని, ప్రతి పేదకు సొంత ఆస్తి ఇవ్వాలన్న ఆలోచనతో నారా చంద్రబాబునాయుడు పేదల కోసం ధనవంతుల ఇళ్లకు తీసిపోని విధంగా అత్యాధునిక సౌకర్యాలతో ఇళ్లు కట్టించి ఇచ్చారని అన్నారు.
మూడు విడతల్లో 8,00,346 ఇళ్లు పంపిణీ చేశారని తాము గర్వంగా చెప్పుకోగలమని లోకేశ్ పేర్కొన్నారు. కానీ, జగన్ తన తండ్రి పాలనలో కట్టిన ఇందిరమ్మ ఇళ్ల వంటి నాసిరకమైన ఇళ్లలోనే పేదలు ఉండాలని భావిస్తున్నారని, టెక్నాలజీ ప్రయోజనాలు పేదలకు అనవసరమని భావిస్తున్నట్టు ఉన్నారని విమర్శించారు.