Andhra Pradesh: అమరావతికి రూ.2,500 కోట్లు ఇచ్చాం.. పోలవరానికి మరో రూ.6,764 కోట్లు అందించాం!: కేంద్ర ఆర్థిక మంత్రి
- ఏపీ ఆర్థికలోటును తీర్చేందుకు రూ.3,979 కోట్లు అందించాం
- లోక్ సభలో కేంద్రాన్ని ప్రశ్నించిన టీడీపీ ఎంపీ కేశినేని నాని
- లిఖితపూర్వకంగా జవాబు ఇచ్చిన ఆర్థిక మంత్రి సీతారామన్
ఆంధ్రుల రాజధాని అమరావతికి ఇప్పటివరకూ రూ.2,500 కోట్ల ఆర్థిక సాయం చేశామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అలాగే ఏపీకి కీలకమైన పోలవరం ప్రాజెక్టు కోసం రూ.6,764 కోట్లను ఇప్పటివరకూ విడుదల చేశామని చెప్పారు. ఏపీ ఆర్థికలోటుతో సతమతం అవుతున్న నేపథ్యంలో రూ.3,979 కోట్ల ఆర్థిక సాయం అందించామని పేర్కొన్నారు. అలాగే మంగళగిరిలో ఎయిమ్స్ ఆసుపత్రి స్థాపన కోసం రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలకు ఆమోదం లభించిందని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఎయిమ్స్ తాత్కాలిక క్యాంపస్ లో 2018-19 బ్యాచ్ లో 50 మంది ఎంబీబీఎస్ విద్యార్థులు చదువుకుంటున్నట్లు సీతారామన్ తెలిపారు. విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో మెట్రో రైలును ఏర్పాటు చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి తమకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)లు ఇంకా అందలేదని స్పష్టం చేశారు. విజయవాడ లోక్ సభ సభ్యుడు కేశినేని నాని అడిగిన ప్రశ్నలకు సీతారామన్ ఈ మేరకు లిఖితపూర్వకంగా జవాబు ఇచ్చారు.