Ambati Rayudu: భారత జట్టులో చోటు దక్కని అంబటి రాయుడికి ఐస్‌ల్యాండ్ నుంచి అదిరిపోయే ఆఫర్!

  • భారత జట్టులో నాలుగో స్థానాన్ని ఆశించి భంగపడిన రాయుడు
  • తమ దేశానికి వచ్చేయాలంటూ ఐస్‌ల్యాండ్ ఆహ్వానం
  • స్పందించని క్రికెటర్

టీమిండియా ఆటగాడు అంబటి రాయుడికి ఐస్‌ల్యాండ్ నుంచి బ్రహ్మాండమైన ఆఫర్ ఒకటి వచ్చింది. ప్రపంచకప్‌లో తలపడే భారత జట్టులో చోటు దక్కుతుందని ఆశించిన రాయుడికి భంగపాటే ఎదురైంది. తనకు బదులుగా విజయ్ శంకర్‌ను తీసుకోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన రాయుడు.. ‘త్రీడీ’ ట్వీట్‌తో మిణుకుమిణుకుమంటున్న అవకాశాలను సైతం చేజేతులా వదిలేసుకున్నాడు.

విజయ్ శంకర్‌ను జట్టులోకి తీసుకున్న సెలక్టర్లు అతడిని 3డీ ప్లేయర్‌గా అభివర్ణించారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన అంబటి ప్రపంచకప్‌లో అతడేమాత్రం ఆడతాడో చూడాలని ఉందని, ఇందుకోసం 3డీ కళ్లద్దాలకు ఆర్డర్ చేశానంటూ సెటైరికల్ ట్వీట్ చేసి బీసీసీఐకి మండేలా చేశాడు. దీంతో విజయ్ శంకర్ గాయపడి జట్టు నుంచి తప్పుకున్నా రాయుడికి అవకాశం రాకుండా పోయింది. విజయ్ శంకర్ స్థానంలో మయాంక్ అగర్వాల్‌ను పిలిపించింది.

దీంతో తీవ్ర మనస్తాపంలో ఉన్న రాయుడికి ఐస్‌ల్యాండ్ నుంచి అద్భుతమైన ఆఫర్ ఒకటి వచ్చింది. 3డీ కళ్లద్దాలను పక్కనపెట్టి మామూలు అద్దాలతో ఈ డాక్యుమెంట్లు చదవాలని పేర్కొంటూ ఆహ్వానాన్ని పంపిన ఐస్‌ల్యాండ్ అంబటి అంటే తమకు ఎంత ఇష్టమో పేర్కొంది. తమ దేశానికి వచ్చేయాలని కోరింది. అక్కడ అతడికి శాశ్వత నివాసం కల్పిస్తామని పేర్కొంది. ఇందుకోసం సమర్పించాల్సిన డాక్యుమెంట్లు ఇవేనంటూ కొన్ని వివరాలు పంపింది. ఐస్‌ల్యాండ్ నుంచి తనకు అందిన ఆఫర్‌పై అంబటి ఇప్పటి వరకు స్పందించలేదు.

Ambati Rayudu
Team India
Iceland
3D player
  • Loading...

More Telugu News