Suryapet District: పెండింగ్ బిల్లులు చెల్లించడం లేదని మిషన్ భగీరథ కాంట్రాక్టర్ల ఆత్మహత్యాయత్నం!
- సూర్యాపేటలో జరిగిన ఘటన
- ఇద్దరు కాంట్రాక్టర్లు, వారి కుటుంబసభ్యుల ధర్నా
- మిషన్ భగీరథ కార్యాలయం ముందు ఆత్మహత్యాయత్నం
తెలంగాణలో ప్రతిష్టాత్మక మిషన్ భగీరథ ప్రాజెక్టు పనులకు సంబంధించిన బిల్లులు చెల్లించడం లేదని ఆరోపిస్తూ కాంట్రాక్టర్లు ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. సూర్యాపేటలోని మిషన్ భగీరథ కార్యాలయం ముందు తమ కుటుంబసభ్యులతో కలిసి కాంట్రాక్టర్లు పురుగుల మందు డబ్బాలు చేతపట్టుకుని ధర్నా నిర్వహించారు. కాంట్రాక్టర్లు తమ కుటుంబసభ్యులతో కలిసి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతుండగా అక్కడి అధికారులు వారి చేతిలోని పెట్రోల్ డబ్బాలను లాక్కున్నారు. బాధితులను ఉన్నతాధికారుల వద్దకు తీసుకెళ్లారు.
పెన్ పహాడ్ మండలంలోని అనంతారం, సూర్యాపేట మండలంలోని కుసుమవారిగూడెం గ్రామంలో నలభై కిలో లీటర్ల సామర్థ్యం కలిగిన రెండు ట్యాంకులను నిర్మించేందుకు కాంట్రాక్టర్లు ఆనందరావు, శంకర్ లు జీవీపీఆర్ కంపెనీతో సబ్ కాంట్రాక్టు కుదుర్చుకున్నారు. ఈ రెండు ట్యాంకుల నిర్మాణానికి సంబంధించి కోటి ఇరవై లక్షల బిల్లు కాగా, ఇప్పటి వరకు 80 లక్షలు మాత్రమే వారికి చెల్లించినట్టు సమాచారం.
ఇంకా, మిగిలిన డబ్బులు చెల్లించాలని కోరుతూ జీవీపీఆర్, మిషన్ భగీరథ కార్యాలయాల చుట్టూ సదరు కాంట్రాక్టర్లు ఎన్నిసార్లు తిరిగినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో, విసిగిపోయిన సదరు కాంట్రాక్టర్లు, తమ కుటుంబసభ్యులతో కలిసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. జీవీపీఆర్ కంపెనీ వాళ్లతో మిషన్ భగీరథ డీఈ కుమ్మక్కయ్యారని వారు ఆరోపించారు. తమ భార్యల పుస్తెల తాళ్లు, నగలు అమ్మి వచ్చిన డబ్బుతో ఇచ్చిన గడువులోగా వాటర్ ట్యాంక్ లు నిర్మించామని చెప్పారు. ఇప్పటికైనా పెండింగ్ బిల్లులు చెల్లించాలని, లేకపోతే తమకు చావే శరణ్యమని బాధిత కాంట్రాక్టర్లు అన్నారు.