kcr: కేసీఆర్ పాలనలో చదువును కొనాల్సిన పరిస్థితి వచ్చింది!: బీజేపీ నేత లక్ష్మణ్
- దేశంలో ఎక్కడా లేని ఫీజులు తెలంగాణ స్కూళ్లలో ఉన్నాయి
- అవగాహన లేని వ్యక్తిని విద్యాశాఖ మంత్రిగా నియమించారు
- టీఆర్ఎస్ నేత రక్షణ కోసమే పోలీసు ఉద్యోగాలు భర్తీ చేశారు
తెలంగాణ వస్తే యువతకు లక్ష ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన కేసీఆర్ ఆ తర్వాత మాట మార్చారని... ఆయనను చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతోందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. దేశంలో ఎక్కడా లేనంత ఎక్కువ ఫీజులు తెలంగాణ స్కూళ్లలోనే ఉన్నాయని చెప్పారు. కేసీఆర్ పాలనలో చదువును కొనాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. ఇంటర్నేషనల్, టెక్నో, ఒలింపియాడ్ తదితర పేర్లతో దోచుకుంటున్నారని మండిపడ్డారు. కనీస అవగాహన కూడా లేని వ్యక్తిని విద్యాశాఖ మంత్రిగా నియమించారని దుయ్యబట్టారు.
27 మంది ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడితే కేసీఆర్ కనీసం స్పందించలేదని లక్ష్మణ్ విమర్శించారు. తెలంగాణ కోసం పోరాడిన విద్యార్థులు కేసీఆర్ మాటలు విని మోసపోయారని అన్నారు. టీఆర్ఎస్ నేతల రక్షణ కోసమే పోలీస్ ఉద్యోగాలను భర్తీ చేశారని చెప్పారు. కాంట్రాక్టర్ల జేబులను నింపడం కోసం సచివాలయం, అసెంబ్లీ నిర్మాణాలకు రూ. 500 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తోందని తెలిపారు.