East Godavari District: ప్రజలను ముంచిన స్కీమ్... బాధితుల చేతికి చిక్కిన నిందితుడి భార్య!
- తణుకులో ఫర్నీచర్ స్కీమ్
- ఆశపడి లక్షలు సమర్పించుకున్న ప్రజలు
- నిందితుడు పారిపోగా, భార్యను పట్టుకున్న బాధితులు
ఫర్నీచర్ స్కీమ్ పేరిట ప్రజలను మోసం చేసి, వారి నుంచి లక్షల కొద్దీ డబ్బు వసూలు చేసిన భార్యాభర్తల్లో భర్త పారిపోగా, భార్య ప్రజలకు చిక్కిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో జరిగింది. బాధితులు వెల్లడించిన వివరాల ప్రకారం, స్థానిక వేల్పూరు రోడ్డులో శ్రీ ఫర్నీచర్ అండ్ ఎలక్ట్రానిక్స్ పేరిట కోర్ల శ్రీనివాసు అనే వ్యక్తి స్టోర్ ను ఓపెన్ చేశాడు. ఫర్నీచర్ స్కీమ్ ను ప్రారంభించి, తక్కువ ధరకు గృహోపకరణాలను కొనవచ్చని ఆశ చూపాడు. ప్రజల నుంచి రూ. కోటికి పైగా వసూలు చేయడంతో పాటు, తన స్టోర్ ను చూపించి, పెద్ద ఎత్తున అప్పులు చేశాడు.
ఆపై అతను ఊరొదిలి పారిపోగా, ఆయన భార్య ప్రసన్న బాధితులకు చిక్కింది. ఆమె ఊరు దాటేందుకు బస్సెక్కే ప్రయత్నం చేస్తుండగా, గమనించిన స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ విషయం బయటకు పొక్కడంతో స్కీమ్ లో భాగంగా లక్షలాది రూపాయలు చెల్లించిన బాధితులు, వారి నుంచి డబ్బు వసూలు చేసిన ఏజంట్లూ స్టేషన్ వద్దకు చేరుకుని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రసన్నను విచారించి, ఆమె భర్తను అరెస్ట్ చేసి, తమకు న్యాయం చేయాలని, లేకుంటే చావే శరణ్యమని హెచ్చరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, త్వరలోనే నిందితుడిని అరెస్ట్ చేస్తామని బాధితులకు హామీ ఇచ్చారు.