Andhra Pradesh: టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ అక్రమాలపై విచారణకు ఆదేశించిన ఏపీ ప్రభుత్వం!
- చింతమనేని కుటుంబం అక్రమంగా లబ్ధిపొందిందన్న అబ్బయ్యచౌదరి
- వైసీపీ నేత ఫిర్యాదును సీరియస్ గా తీసుకున్న ఇన్ చార్జ్ మంత్రి
- విచారణ జరిపి నివేదిక సమర్పించాలని అధికారులకు ఆదేశం
టీడీపీ నేత, దెందూలూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై ఇప్పటికే వ్యవసాయ పైపులు దొంగలించినట్లు పోలీసులు కేసు నమోదుచేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన మరో వివాదంలో చిక్కుకున్నారు. దెందులూరు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పశుసంవర్థక శాఖలో అక్రమాలు జరిగాయని వైసీపీ నేత, ప్రస్తుత దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఈరోజు ఆరోపించారు.
పశుసంవర్థక శాఖ ప్రజలకు అందించాల్సిన ఫలాలను చింతమనేని కుటుంబం అక్రమంగా పొందిందని ఆయన విమర్శించారు. పశుసంవర్థక శాఖ లబ్ధిదారుల జాబితాలో చింతమనేని ప్రభాకర్ భార్య, తండ్రి కేశవరావుల పేర్లు ఉన్నాయని ఆరోపించారు. దీంతో ఈ విషయాన్ని ఏపీ ఉప ముఖ్యమంత్రి, జిల్లా ఇన్ చార్జ్ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ సీరియస్ గా తీసుకున్నారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపి వీలైనంత త్వరగా నివేదిక సమర్పించాలని ఆదేశించారు.