Andhra Pradesh: జూలై 1 నుంచి ప్రజాదర్బార్ నిర్వహించనున్నసీఎం జగన్.. చకచకా ఏర్పాట్లు పూర్తి!
- తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం వద్ద ఏర్పాట్లు
- ఉదయం 8 నుంచి 9 గంటల వరకూ ప్రజలను కలవనున్న జగన్
- స్వయంగా ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్న సీఎం
తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తరహాలో ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ప్రజాదర్బార్ నిర్వహించాలని ఏపీ సీఎం జగన్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. తాజాగా వచ్చే నెల 1 నుంచి ప్రజాదర్బార్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఇందుకు సంబంధించి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తిచేశారు. ‘ప్రజా దర్బార్’లో భాగంగా రోజూ ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకూ ప్రజలను సీఎం జగన్ కలుసుకోనున్నారు.
ఈ సందర్భంగా ప్రజల సమస్యలను ముఖ్యమంత్రి స్వయంగా అడిగి తెలుసుకుంటారు. సీఎం జగన్ ను కలుసుకోవడానికి వచ్చే ప్రజలు వేచిచూడటం కోసం తాడేపల్లి క్యాంపు ఆఫీసు దగ్గర అధికారులు ఓ షెడ్డును నిర్మించారు. అక్కడే మంచినీరు, ఫ్యాన్లను ఏర్పాటు చేశారు. కాగా, ప్రజాదర్బార్ ముగిసిన అనంతరం జగన్ రోజువారీ అధికారిక కార్యక్రమాలు, శాఖాపరమైన సమీక్షల్లో పాల్గొంటారు. ప్రజాదర్బార్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు భారీ బందోబస్తుతో పాటు మెటల్ డిటెక్టర్లను సైతం ఏర్పాటుచేశారు.