Andhra Pradesh: కోటంరెడ్డికి నెల్లూరులో డెన్ ఉంది.. అందులో పోలీసులు, గవర్నమెంట్ అధికారులకు నట్లు బిగిస్తారట!: వర్ల రామయ్య

  • వైసీపీ ప్రభుత్వ పాలనలో శాంతిభద్రతలు అదుపుతప్పాయి
  • కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలి
  • జర్నలిస్టు-కోటంరెడ్డి ఆడియో క్లిప్ వినిపించిన టీడీపీ నేత

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లోనే రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పాయని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య విమర్శించారు. అమరావతిలో ఈరోజు మీడియాతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా నెల్లూరులో ఓ జర్నలిస్టును వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బెదిరించినట్లుగా చెబుతున్న ఆడియో క్లిప్ ను మీడియా ముందు ప్రదర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. ఏపీని బిహార్ మాదిరిగా మార్చాలని సీఎం జగన్ అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు.

జర్నలిస్టును బెదిరించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కోటంరెడ్డి ఆఫీసులో పోలీసులు, ఇతర ప్రభుత్వ అధికారులకు కూడా నట్లు టైట్ చేస్తారని ఆరోపించారు. నట్లు బిగించడానికి వాళ్లు ఏమైనా యంత్రాలా? అని ప్రశ్నించారు. కోటంరెడ్డి ఆఫీసు నిజంగా ఆఫీసు కాదనీ, అదొక డెన్ అని వ్యాఖ్యానించారు. ప్రతీపౌరుడిని రక్షించడం ప్రభుత్వ బాధ్యత అని వర్ల రామయ్య గుర్తుచేశారు. ఈ విషయాన్ని మర్చిపోయి హోంమంత్రి మేకతోటి సుచరిత మాట్లాడుతున్నారని విమర్శించారు.

మా ఎమ్మెల్యేలు అందరూ సంతోషంగా ఉండేలా చూడండి అంటూ కలెక్టర్ల సమావేశంలో జగన్ చెప్పారనీ, ఇది చాలా తప్పుడు మాట అని వ్యాఖ్యానించారు. జగన్ చెప్పిన ఈ మాటతోనే వైసీపీ ఎమ్మెల్యేలు రెచ్చిపోతున్నారనీ, మేమే రారాజులం అన్నట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరిని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి జగన్ దేనని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు సంతోషంగా ఉండాలంటే వాళ్లు చెప్పిన పనులు చేయాల్సి ఉంటుందని చెప్పారు. వైసీపీ ఎమ్మెల్యేలు తాము ప్రజాప్రతినిధులం అనుకోవడం లేదనీ, నియోజకవర్గానికి సామ్రాట్టులం అనుకుంటున్నారని దుయ్యబట్టారు. 

  • Loading...

More Telugu News