Telangana: ఆ పోరాటాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం నేడు నీరుగార్చింది: బీజేపీ నేత మురళీధర్ రావు
- ఈ విషయంలో ఎటువంటి అనుమానం లేదు
- టీఆర్ఎస్ ను ఎదుర్కొనే శక్తి కాంగ్రెస్ పార్టీకి లేదు
- 2023లో తెలంగాణలో బీజేపీకి అధికారం
తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ పై బీజేపీ జనరల్ సెక్రటరీ మురళీధర్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఎంఐఎం చేతుల్లో టీఆర్ఎస్ ఉందని విమర్శించారు. ఈ విషయంలో ఎటువంటి అనుమానం లేదని అన్నారు. నాడు నిజాం, రజాకార్ల ఛాందస వాదానికి తెలంగాణ ప్రజలు వ్యతిరేకంగా పోరాడారని, ఆ పోరాటాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం నేడు నీరుగార్చిందని విమర్శించారు. రజాకార్ల ఛాందసవాదానికి వ్యతిరేకంగా పోరాడిన సమరయోథులను గౌరవించని టీఆర్ఎస్ ను, ఆ పార్టీ మత ఛాందసవాద రాజకీయాలను ప్రజలు అంగీకరించరని అన్నారు.
టీఆర్ఎస్ ను ఎదుర్కొనే శక్తి కాంగ్రెస్ పార్టీకి లేదని, ఆ పార్టీని ఎదుర్కొనే శక్తి కేవలం, బీజేపీకి మాత్రమే ఉందని అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో టీఆర్ఎస్ కు నిజమైన ప్రతిపక్షం అవసరమని, ఆ పాత్రను పోషించగలిగేది బీజేపీయే అని అన్నారు. రాబోయే రోజుల్లో బీజేపీ పోరాడాల్సి ఉంటుందని, ప్రతిపక్షంగా వ్యవహరించాల్సి ఉంటుందని అన్నారు. టీఆర్ఎస్ విధానాలను ఎండగడతామని, అప్పుడు మాత్రమే ప్రజల్లో తమ పార్టీపై విశ్వాసం పెరుగుతుందని, టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ అని ప్రజలు నమ్ముతారని అభిప్రాయపడ్డారు. 2023లో తెలంగాణలో బీజేపీ అధికార పక్షం కావడం ఖాయమని మురళీధర్ రావు ధీమా వ్యక్తం చేశారు.