Chandrababu: భద్రత తగ్గిస్తారా... నాకు ప్రజలే రక్షకులు: చంద్రబాబు
- అప్పట్లో అలిపిరి దాడి నుంచి బయటపడ్డాను
- దేవుడు, ప్రజల ఆశీస్సులే కారణం
- హోంమంత్రి అలా మాట్లాడడం సరికాదు
నిన్నమొన్నటి దాకా అందరి దృష్టి ప్రజావేదికపై ఉండగా, ఇప్పుడు దాని స్థానంలో చంద్రబాబు నివాసం వచ్చిచేరింది. ఉండవల్లిలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నివసిస్తున్న భవనం కూడా అక్రమకట్టడమేనని అంటున్న ఏపీ ప్రభుత్వం నోటీసులు పంపడం తెలిసిందే. అంతేకాకుండా, ఆయనకు భద్రత కూడా తగ్గించారు. దీనిపై చంద్రబాబు స్పందించారు. అప్పట్లో అలిపిరి దాడి నుంచి బయటపడడానికి భగవంతుడి ఆశీస్సులతో పాటు ప్రజల దీవెనలు కూడా కారణమని చెప్పారు. తనకు భద్రత తగ్గించడంపై మాట్లాడుతూ, తనకు ప్రజలే రక్షకులని అన్నారు.
రాష్ట్రంలో జరుగుతున్న దాడులు, అవాంఛనీయ పరిస్థితుల పట్ల హోం మంత్రి మేకతోటి సుచరిత స్పందిస్తున్న విధానం సరైంది కాదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. "ఎన్నో జరుగుతుంటాయి, అంతమాత్రాన ప్రతిచోట ఉండి కాపలా కాయలేం కదా" అని హోంమంత్రే అంటే ఇక సామాన్యుడికి దిక్కెవరని ప్రశ్నించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలతో రాష్ట్రానికి పెట్టుబడులు రావని స్పష్టం చేశారు. ఉండవల్లిలోని తన నివాసంలో పార్టీ నేతలతో సమావేశమైన సందర్భంగా చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.