KCR: కృష్ణా, గోదావరి నీటిలభ్యతపై జగన్ కు పవర్ పాయింట్ ప్రజంటేషన్ తో వివరించిన కేసీఆర్
- హైదరాబాద్ లో తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం
- సమావేశంలో మంత్రులు, అధికారులు
- శ్రీశైలం, సాగర్ ప్రాజక్టులకు గోదావరి నీరు
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జలవనరుల అంశంపై ఇవాళ హైదరాబాద్ లో సమావేశమైన సంగతి తెలిసిందే. ఏపీ, తెలంగాణ మంత్రులు, ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ హైలెవెల్ భేటీలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కృష్ణా, గోదావరి నీటి లభ్యతపై జగన్ తదితరులకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. కృష్ణా, గోదావరి నదుల ద్వారా 4,000 టీఎంసీల నీటి లభ్యత ఉందని కేసీఆర్ స్పష్టం చేశారు. అందుబాటులో ఉన్న నీటితో రెండు తెలుగు రాష్ట్రాలను సుసంపన్నం చేయవచ్చని అన్నారు.
గోదావరి ద్వారా ప్రతి సంవత్సరం 3,000 టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తోందని, ఇలాంటి పరిస్థితుల్లో గోదావరి నీటిని శ్రీశైలం, సాగర్ కు తరలిస్తే ఏపీ, తెలంగాణలకు మేలు జరుగుతుందని స్పష్టం చేశారు. దీనివల్ల రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలకు మేలు చేకూరుతుందని వివరించారు. నీళ్ల కోసం ట్రైబ్యునళ్లు, న్యాయస్థానాల చుట్టూ తిరగడం కంటే ఉన్న వనరులను సద్వినియోగం చేసుకునే మార్గాలపై దృష్టిపెట్టడం మేలని కేసీఆర్ అభిప్రాయపడ్డారు.
కేంద్రపభుత్వం నదుల అనుసంధానం అనే ప్రతిపాదన చేస్తోందని, తెలుగు రాష్ట్రాల అవసరాలు తీర్చాక కేంద్రం ప్రతిపాదనలపై నిర్ణయం తీసుకోవచ్చని పేర్కొన్నారు. మరోవైపు, వంశధార, నాగావళి నదీజలాలను కూడా సమర్థంగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నదీజలాలు సముద్రంపాలవకుండా చూస్తే ఉత్తరాంధ్ర ప్రజల కష్టాలు తీరతాయని, తద్వారా, నిర్లక్ష్యానికి గురవుతున్నామనే భావన ఉత్తరాంధ్ర వాసుల్లో ఉండదని వెల్లడించారు.