Chandrababu: చంద్రబాబునాయుడు చేసిన తప్పేంటి?: జగన్ కు అచ్చెన్నాయుడు సూటి ప్రశ్న
- చంద్రబాబుపై జగన్ వ్యక్తిగతంగా కక్ష పెట్టుకున్నారు
- ఏ ప్రతిపక్ష నేతకు చేయనంత అవమానం చేస్తున్నారు
- ఎవరు అధికారంలో ఉన్నాసరే ప్రతిపక్షాన్ని గౌరవించాలి
చంద్రబాబునాయుడుపై వ్యక్తిగతంగా కక్ష పెట్టుకున్న సీఎం జగన్, ఏ ప్రతిపక్ష నాయకుడికి చేయనంత అవమానాన్ని చేస్తున్నారని టీడీపీ నేత అచ్చెన్నాయుడు విమర్శించారు. ఉండవల్లిలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబునాయుడు చేసిన తప్పేంటని మీడియా ద్వారా ముఖ్యమంత్రిని అడుగుతున్నానని అన్నారు. ఐదేళ్ల పాటు రోజుకు పద్దెనిమిది గంటల చొప్పున రాష్ట్రాభివృద్ధి కోసం, ప్రజల బాగోగుల కోసం చంద్రబాబు శ్రమించారని అన్నారు. ఇలా కష్టపడటం చంద్రబాబు నాయుడు చేసిన తప్పా? అని ప్రశ్నించారు.
చంద్రబాబు భద్రతను బాగా తగ్గించేయడం చాలా దౌర్భాగ్యమని విమర్శించారు. ‘సాక్షాత్తూ నీ త్రండి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా చంద్రబాబునాయుడు గారి భద్రత విషయం జోలికి రాలేదు’ అని జగన్ పై విరుచుకుపడ్డారు. జగన్ ప్రతిపక్షనాయకుడిగా ఉన్న సమయంలో ఆయనేమీ సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కాదని అన్నారు. ఒక ప్రతిపక్ష నాయకుడిగా అడిగిన భద్రతను జగన్ తో పాటు ఆయన కుటుంబసభ్యులకు కల్పించిన విషయాన్ని గుర్తుచేశారు. ఎవరు అధికారంలో ఉన్నాసరే ప్రతిపక్షాన్ని, నాయకులను గౌరవించాలని కోరారు.