Jagan: ప్రగతి భవన్ కు చేరుకున్న వైఎస్ జగన్... స్వాగతం పలికిన కేసీఆర్!
- విభజన సమస్యల పరిష్కారమే లక్ష్యం
- గోదావరి నీటిని శ్రీశైలం చేర్చేందుకు ప్లాన్
- రెండు రోజులు సాగనున్న చర్చలు
విభజన తరువాత రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా, ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకున్న ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ మరోసారి సమావేశమయ్యారు. నీటి వివాదాల పరిష్కారం కోసం రెండు రోజుల పాటు చర్చలు జరిపేందుకు కొద్దిసేపటి క్రితం వైఎస్ జగన్, బేగంపేటలోని ప్రగతి భవన్ కు చేరుకున్నారు. జగన్ కు సాదర స్వాగతం పలికిన కేసీఆర్, లోపలికి తోడ్కుని వెళ్లారు.
జగన్ వెంట మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, పేర్ని నాని, కురసాల కన్నబాబులతో పాటు సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం కూడా చర్చల్లో పాల్గొనేందుకు వచ్చారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున కూడా మంత్రులు, నీటి పారుదల విభాగం అధికారులు పాల్గొననున్నారు.
విభజన అంశాలతో పాటు గోదావరి, కృష్ణా జలాల వాటా, పంపకాలు, కేటాయింపులు, గోదావరి నీటిని శ్రీశైలం చేర్చడం తదితర అంశాలను చర్చించనున్నారు. కోర్టు కేసుల కారణంగా ఆగిన ప్రాజెక్టులు, ఉద్యోగుల బదిలీలపై నెలకొన్న వివాదాలు కూడా ప్రస్తావనకు రానున్నాయి. షెడ్యూల్ 9లోని వాణిజ్య పరమైన భవనాల అప్పగింతలపైనా జగన్, కేసీఆర్ చర్చించనున్నారు.