Andhra Pradesh: చంద్రబాబు ఇంటికి నోటీసుల వ్యవహారం.. సీఆర్డీఏ కంటే ముందే గెస్ట్ హౌస్ ఉందన్న యనమల!
- చంద్రబాబుపై కక్ష సాధించే ఆలోచనలోనే ఉన్నారు
- లీగల్ అంశాలను కూడా ప్రభుత్వం పరిశీలించట్లేదు
- కోర్టులో కేసు ఉండగా కూల్చివేత నోటీసు ఇస్తారా?
టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు ఉంటున్న నివాసానికి సీఆర్డీఏ అధికారులు నోటీసులు అంటించిన సంగతి తెలిసిందే. కృష్ణానదికి 100 మీటర్ల సమీపంలో ఈ భవనం కట్టడంపై వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించారు. తాజాగా ఈ వ్యవహారంపై టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు స్పందించారు. ‘వీళ్ల ఆత్రుత చూస్తాఉంటే చంద్రబాబు నాయుడి మీద ఎట్లా కక్ష తీర్చుకోవాలన్న ఆలోచనలోనే వీరు ఉన్నారనిపిస్తోంది.
ఈ వ్యవహారంలో లీగల్ అంశాలను కూడా పరిశీలించలేదు. లింగమనేని గెస్ట్ హౌస్ ను పంచాయతీ పర్మిషన్ తో కట్టారు. అనుమతి లేకుండా కట్టలేదు. అమరావతి అన్నది పంచాయతీ ఏరియా. అక్కడ రాజధాని వచ్చాక వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఓ పిల్ వేశాడు. ఈ అక్రమ కట్టడాలను కూల్చేయాలని పిటిషన్ వేశారు. దానిపై ఇంకా తీర్పు రాలేదు. ఇలా కోర్టులో కేసు ఉన్నప్పుడు బిల్డింగ్ కూల్చివేతకు నోటీసులు ఎలా ఇస్తారు? లింగమనేని బిల్డింగ్ కట్టినప్పుడు సీఆర్డీఏనే లేదు’ అని స్పష్టం చేశారు.