Chittoor District: నారావారి పల్లెలో చంద్రబాబు ఇంటి వద్ద భద్రత భారీగా కుదింపు
- ఇకపై ఓ ఏఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు మాత్రమే విధుల్లో
- చంద్రగిరి స్టేషన్ సిబ్బందికే బాధ్యతలు
- ఏపీఎస్పీ సిబ్బంది పూర్తిగా తొలగింపు
మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వ్యక్తిగత, కుటుంబపరమైన భద్రత విషయంలో అధికార వైసీపీ ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. బాబు స్వగ్రామం నారావారి పల్లెలో ఆయన ఇంటి వద్ద భద్రతను పూర్తిగా కుదించేసి కేవలం చంద్రగిరి పోలీస్ స్టేషన్ సిబ్బందికి పరిమితం చేశారు.
చంద్రబాబు భార్య భువనేశ్వరి, ఆయన కోడలు బ్రాహ్మణిలకు పూర్తిగా భద్రత తొలగించిన ఏపీ ప్రభుత్వం బాబు తనయుడు, మాజీ మంత్రి నారా లోకేష్ భద్రతను కూడా తగ్గిస్తూ రెండు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా నారావారి పల్లెలో బాబు ఇంటివద్ద భద్రత కుదించారు. ఇప్పటి వరకు ఏపీఎస్పీ బెటాలియన్‌కు చెందిన ఓ ఆర్ఎస్ఐ, ఏఎస్ఐ, ఐదుగురు కానిస్టేబుళ్లతోపాటు చంద్రగిరి స్టేషన్‌కు చెందిన ఓ ఏఎస్ఐ, నలుగురు కానిస్టేబుళ్లు నిత్యం బందోబస్తు నిర్వహించేవారు. ఇకపై చంద్రగిరి పోలీసుస్టేషన్‌కు చెందిన ఏఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు మాత్రమే బాబు ఇంటివద్ద భద్రత బాధ్యతలు చూస్తారు.