Balakrishna: విజయనిర్మల మృతిపై స్పందించిన నందమూరి బాలకృష్ణ!

  • గతరాత్రి కన్నుమూసిన విజయనిర్మల
  • ఎంతో బాధాకరమన్న బాలకృష్ణ
  • ఎంతో మంది మహిళలకు ఆదర్శమని వ్యాఖ్య

గత రాత్రి టాలీవుడ్ ప్రముఖ దర్శకురాలు, హీరో కృష్ణ భార్య విజయనిర్మల అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ వార్తపై నందమూరి బాలకృష్ణ స్పందించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టారు. "నటిగా, దర్శకురాలిగా, నిర్మాతగా తనదైన ప్రత్యేకతను సంపాదించుకున్న విజయనిర్మలగారు కన్నుమూయడం ఎంతో బాధాకరం. సినీ పరిశ్రమలో మహిళా సాధికారతను చాటిన అతికొద్ది మంది మహిళల్లో విజయనిర్మలగారు ఒకరు. నాన్నగారి 'పాండురంగ మహాత్మ్యం' సినిమాలో కృష్ణుడిగా నటించారు. అదే ఆవిడ నటించిన తొలి తెలుగు సినిమా.

బాలనటి నుంచి హీరోయిన్ గా కూడా ఎన్నో గొప్ప చిత్రాల్లో నటించారు. నాన్నగారితో 'మారిన మనిషి', 'పెత్తందార్లు', 'నిండు దంపతులు', 'విచిత్ర కుటుంబం' సినిమాల్లో నటించారు. అలాగే దర్శకురాలిగా 44 చిత్రాలను డైరెక్ట్ చేయడం చాలా గొప్ప విషయం. దర్శకురాలిగా గిన్నిస్ బుక్ రికార్డ్ సాధించి ఎంతో మంది మహిళలకు ఆదర్శంగా నిలిచారు. ఆమె మృతి చిత్రసీమకు తీరనిలోటు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను" అని బాలకృష్ణ తన సంతాపాన్ని వెలిబుచ్చారు.

Balakrishna
Vijaya Nirmala
Death
Condolence
  • Loading...

More Telugu News