Andhra Pradesh: ఏపీలో గత ప్రభుత్వ నిర్ణయాల సమీక్షకు కేబినెట్ ఉపసంఘం ఏర్పాటు!
- కేబినెట్ ఉప సంఘంలో ఐదుగురు మంత్రులు
- రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కూడా
- ఉపసంఘం ప్రత్యేక ఆహ్వానితులుగా వైసీపీ నేతలు ముగ్గురు
ఏపీలో గత ప్రభుత్వ నిర్ణయాల సమీక్షకు కేబినెట్ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఐదుగురు మంత్రులతో ఈ మంత్రి వర్గ ఉప సంఘాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఉపసంఘంలో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కురసాల కన్నబాబు, అనిల్ కుమార్, గౌతంరెడ్డి, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్ సింగ్ ఉన్నారు.
ఇక ఉపసంఘం ప్రత్యేక ఆహ్వానితులుగా వైసీపీ నేతలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. మైనింగ్ లీజులు, సాగునీటి ప్రాజెక్టుల కాంట్రాక్టులు, ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రారంభించిన పథకాలు, ఐటీ ప్రాజెక్టులు, భూ కేటాయింపులు, పోలవరం, సీఆర్డీఏ, ఓడరేవులు, విమానాశ్రయాల టెండర్ల ప్రక్రియపై మంత్రి వర్గ ఉపసంఘం సమీక్షించనుంది. మంత్రి వర్గ ఉపసంఘం ఆరు వారాల్లోగా నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తుంది.