Andhra Pradesh: ప్రజావేదిక కూల్చివేతపై మరోసారి స్పందించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్!
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-ea14493f7ba61c6d1d92f519e355d9efa2c553b9.jpg)
- అందరి అక్రమ కట్టాడాలను ప్రభుత్వం కూల్చాలి
- అప్పుడే ప్రజలకు సర్కారుపై నమ్మకం ఏర్పడుతుంది
- ఊపిరి ఉన్నంత వరకూ ప్రజల కోసం పోరాడుతా
- గుంటూరులో మీడియాతో జనసేనాని
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈరోజు గుంటూరు జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. దాదాపు సంవత్సరం క్రితం నంబూరులోని దశావతార వెంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన బ్రహ్మోత్సవాలకు తాను హాజరయ్యానని జనసేనాని తెలిపారు. మళ్లీ ఇప్పుడు స్వామివారిని దర్శించుకున్నానని చెప్పారు.
జిల్లాలో పార్టీ పటిష్టతపై ముఖ్యనేతలు, కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహించామని చెప్పారు. జూలై రెండో వారం నుంచి 175 నియోజకవర్గాల్లో పార్టీ విజయం కోసం గట్టిగా పనిచేసిన 15-30 మంది జనసేన కార్యకర్తలను పార్టీ ప్రధాన కార్యాలయానికి పిలిపించుకుంటామని చెప్పారు. అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికలు ఎలా జరిగాయి? పోలింగ్ సందర్భంగా జరిగిన తప్పులు ఏంటి? అనే విషయాన్ని ఈ సందర్భంగా సమీక్షిస్తానని తెలిపారు.
ప్రజలకు అండగా ఉండాలన్న ఉద్దేశంతోనే తాను జనసేన పార్టీని స్థాపించానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఆఖరి శ్వాస ఉన్నంతవరకూ ప్రజల కోసం పోరాడుతానని తేల్చిచెప్పారు. ఇక ప్రజావేదికను ప్రభుత్వం కూల్చివేయడంపై పవన్ కల్యాణ్ స్పందిస్తూ.. ‘పర్యావరణ నిబంధనలను అతిక్రమించే ప్రదేశం ఈ భారతదేశం. నిబంధనలు అతిక్రమించే పెద్దస్థాయి వ్యక్తులయినా, చిన్నస్థాయి వ్యక్తులు అయినా అందరికీ సమానంగా న్యాయం జరగాలి. సరైన అనుమతులు లేకుండా అక్రమంగా కట్టిన ప్రతీ కట్టడాన్ని ప్రభుత్వం కూల్చాలి. అప్పుడే ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం ఉంటుంది. ఈ నమ్మకాన్ని ప్రభుత్వం నిలబెట్టుకుంటుందని ఆశిస్తున్నా’ అని పేర్కొన్నారు.