Istambul: కాలికి గాయమైతే ఫార్మసీకి వెళ్లి చికిత్స చేయించుకున్న శునకం... వైరల్ అవుతున్న వీడియో!
- ఇస్తాంబుల్ లో వీధి శునకానికి గాయం
- వెంటనే ఫార్మసీకి వెళ్లి చికిత్స చేయాలని కోరిన వైనం
- చికిత్స తరువాత యజమానికి కృతజ్ఞతలు కూడా
ఏదైనా దెబ్బ తగిలినా, అనారోగ్యానికి గురైనా మనమేం చేస్తాం? వెంటనే ఆసుపత్రికి వెళతాం. అదే జంతువులైతే... బాధను భరిస్తూ విలవిల్లాడుతుంటాయి. కానీ, ఈ వీధి శునకం మాత్రం అలా కాదు. దెబ్బ తగిలితే దానికి ఎక్కడికి వెళ్లాలో తెలుసు. అదే దీన్ని ప్రత్యేకంగా నిలిపింది. ఓ వీడియోను తెగ వైరల్ చేసింది.
వివరాల్లోకి వెళితే, గతవారంలో ఇస్తాంబుల్ లోని ఓ వీధి కుక్క కాలికి దెబ్బ తగిలింది. అది వెంటనే, దగ్గర్లోనే బానూ సెంగిజ్ అనే వ్యక్తి నిర్వహిస్తున్న ఫార్మసీకి వెళ్లింది. చికిత్స చేయాలని దీనంగా మొహం పెట్టింది. అదే దుకాణంలోని కాపలా కుక్క వస్తే, తన భాషలో దానికి విషయం చెప్పింది. దుకాణం యజమాని వచ్చి, ఏం జరిగిందన్నట్టు చూస్తే, తన కాలిని పైకెత్తి చూపింది.
విషయాన్ని అర్ధం చేసుకున్న అతను దానికి చికిత్స చేయగా, వెళుతూ వెళుతూ ఆ శునకం తన శైలిలో కృతజ్ఞతలు కూడా చెప్పింది. ఇందుకు సంబంధించిన వీడియోను అతను సోషల్ మీడియాలో పెట్టడంతో, జంతువులపై అతనికి ఉన్న ప్రేమను తెగ పొగిడేస్తున్నారు నెటిజన్లు. ఇదే సమయంలో ఆ శునకం తెలివితేటలపైనా ప్రశంసల జల్లు కురుస్తోంది.