janasena: ప్రజావేదికనే కాదు.. అన్ని అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలి: పవన్ కల్యాణ్ డిమాండ్
- ఆ నిబంధన అన్ని అక్రమ నిర్మాణాలకు వర్తింపజేయాలి
- లేకపోతే ప్రభుత్వం చిత్తశుద్ధిని శంకించాల్సి వస్తుంది
- మా పార్టీ నాయకులెవ్వరూ ‘జనసేన’ను వీడట్లేదు
చంద్రబాబు నివాసం పక్కనే ఉన్న అక్రమ నిర్మాణం ప్రజావేదికతో పాటు కరకట్టపై ఉన్న మిగిలిన అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని సీఎం జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తారని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ను మీడియా ప్రశ్నించింది. ఇందుకు పవన్ సమాధానమిస్తూ, ఆ నిబంధనను అన్ని అక్రమ నిర్మాణాలకు వర్తింపజేయాలని సూచించారు. ఈ నిబంధనను కేవలం కరకట్టపై ఉన్న వాటికే వర్తింపజేస్తే ప్రభుత్వ చిత్త శుద్ధిని శంకించాల్సి వస్తుందని అన్నారు.
విజయవాడలో జనసేన పార్టీ కార్యాలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల్లో పార్టీ ఓడిపోతే ఒక భావజాలానికి కట్టుబడి, ప్రయాణానికి సిద్ధపడ్డ వాళ్లు ఓడినా, గెలిచినా భయపడరని, కుంగిపోరని చెప్పారు. అలా కాకుండా, రాజకీయపార్టీ తనకు రక్షణ కవచంగా ఉపయోగపడుతుందని ఏ నాయకుడైతే భావిస్తారో వాళ్లు తమ పార్టీ ఓటమిపాలైతే భయపడిపోతారని, అభద్రతాభావానికి లోనవుతుంటారని అభిప్రాయపడ్డారు. ఆ క్రమంలోనే నాయకులు పార్టీలు మారుతుంటారని చెప్పారు.
ఇప్పటి వరకూ తమ పార్టీ నుంచి అయితే ఏ నాయకుడూ ‘జనసేన’ను వీడట్లేదని స్పష్టం చేశారు. మిగతా పార్టీల నాయకుల గురించి, వారి వ్యక్తిగత పరిస్థితుల గురించి తనకు తెలియదని అన్నారు.