gulam navi azad: నయా భారత్ ను మీ వద్దే ఉంచుకుని.. పాత భారత్ ను మాకు ఇచ్చేయండి: గులాం నబీ అజాద్
- పాత భారత్ లో ప్రేమాభిమానాలు ఉండేవి
- నయా భారత్ లో పక్కవారిని చూసి భయపడే పరిస్థితి వచ్చింది
- 'సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్' ఎక్కడా కనిపించడం లేదు
హింస, హత్యలకు బీహార్ కేంద్రంగా మారిందని రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నేత గులాం నబీ అజాద్ మండిపడ్డారు. ప్రతి వారం దళితులు, ముస్లింలు హత్యకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 'సబ్ కా సాథ్... సబ్ కా వికాస్' విషయంలో ప్రధానికి తాము కూడా మద్దతు తెలుపుతున్నామని... అయితే, అది ఎక్కడా కనిపించడం లేదని ఎద్దేవా చేశారు.
నయా భారత్ ను మీ వద్దే ఉంచుకోవాలని... పాత భారత్ ను తమకు ఇచ్చేయాలని అన్నారు. పాత భారత్ లో ప్రేమ, అభిమానం, సంస్కృతి ఉండేవని చెప్పారు. దళితులు, ముస్లింలు కష్టాలకు గురైతే హిందువులు కూడా బాధపడేవారని అన్నారు. హిందువుల కళ్లలో నలక పడితే, దళితులు, ముస్లింల కళ్లలో నుంచి నీళ్లు వచ్చేవని చెప్పారు.
పాత భారత్ లో కోపం, ద్వేషం, హత్యలు లేవని అజాద్ అన్నారు. కానీ, నయా భారత్ లో మనుషులంతా ఒకరికొకరు శత్రువుల్లా మారిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అడవిలోని జంతువులకు భయపడటం సంగతి అటుంచితే... ఒకే కాలనీలో ఉన్న ఇతరులను చూసి భయపడే పరిస్థితి వచ్చిందని దుయ్యబట్టారు. హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రిస్టియన్లు ప్రేమాభిమానాలతో కలసి ఉండే భారత్ ను తమకు ఇవ్వాలని కోరారు.