lottery: కానిస్టేబుల్‌కు జాక్ పాట్...లాటరీలో రూ.2 కోట్లు!
- సాధారణ ఉద్యోగిని వరించిన లక్ష్మీకటాక్షం
- అనుకోకుండా ప్రభుత్వ లాటరీ టికెట్టు కొనుగోలు
- దానికే బహుమతి అనగానే ఉబ్బితబ్బిబ్బవుతున్న వైనం
లక్ష్మీకటాక్షం ఎప్పుడు, ఎవరిని ఎలా వరిస్తుందో చెప్పలేం. అతనో సాధారణ కానిస్టేబుల్. ప్రభుత్వ ఉద్యోగమే అయినా బాధ్యత బరువులో జీవన పోరాటం చేస్తున్నాడు. అటువంటి వ్యక్తికి లాటరీలో 2 కోట్ల బహుమతి రావడంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు.
వివరాల్లోకి వెళితే...పంజాబ్‌లోని హోషియార్ పూర్ సమీపంలోని మోటియాన్ గ్రామానికి చెందిన అశోక్‌కుమార్‌కు తొమ్మిదేళ్ల క్రితం కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది. వచ్చే జీతంతో పడుతూ లేస్తూ కుటుంబాన్ని నెట్టుకు వస్తున్నాడు. ఉండడానికి ఓ నీడ ఉంటే ఏదోలా జీవితం నెట్టుకు రావచ్చునని బ్యాంకులో అప్పుతీసుకుని ఓ ఇల్లు కట్టుకున్నాడు. కానీ వచ్చే జీతంలో ఎక్కువ మొత్తం రుణ బకాయిగానే పోతుండడంతో ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదు.
ఈ పరిస్థితుల్లో ఓసారి స్టేషన్ విధుల్లో ఉండగా ప్రభుత్వ లాటరీ టికెట్టు కొనాలంటూ ఓ వ్యక్తి వచ్చాడు. అదృష్టాన్ని పరీక్షించి చూసుకుందామని రూ.200 పెట్టి ఓ టికెట్ కొన్నాడు. ఆ తర్వాత ఆ టికెట్‌ను ఓ మూలన పడేసి మర్చిపోయాడు. తీరా ఓ రోజు పంజాబ్ ప్రభుత్వం నిర్వహించే 'లోహ్ రీ బంపర్-2019'లో మీకు రూ.2 కోట్ల బహుమతి వచ్చిందని తెలియగానే అవాక్కయ్యాడు. అప్పుడుగాని తాను టికెట్టు తీసుకున్న విషయం గుర్తుకురాలేదు. దీంతో పడేసిన టికెట్ కోసం వెతికాడు. అదృష్టవశాత్తు అది దొరకడంతో దానితో తన నంబర్‌ను సరిపోల్చుకుని సంబరాల్లో మునిగిపోయాడు.