Chandrababu: పార్టీ నేతలతో చంద్రబాబు మరోసారి టెలీకాన్ఫరెన్స్... ఎవరేమన్నారంటే..!
- తాజా పరిణామాలను చంద్రబాబుకు వివరించిన నేతలు
- ఎంపీలు బీజేపీలో చేరడం ఫిరాయింపుల కిందికే వస్తుందన్న ముఖ్యులు
- ఎంపీల విలీనం అనైతికం అన్న యనమల
టీడీపీలో ఏర్పడిన కల్లోలంపై చర్చించడానికి పార్టీ అధినేత చంద్రబాబునాయుడు మరోసారి ముఖ్యనేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిణామాలను నేతలు చంద్రబాబుకు వివరించారు. టీడీపీ రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరడం ఫిరాయింపు కిందికే వస్తుందని అన్నారు. అంతేకాకుండా, ఈ వ్యవహారంపై నేతలు తమ అభిప్రాయాలను స్పష్టం చేశారు.
టీడీపీ ఎంపీల విలీనం అనైతికం, అప్రజాస్వామికం. దీనిపై న్యాయపోరాటానికి సంబంధించిన అంశాలను పరిశీలిస్తున్నాం. రుణమాఫీ మిగతా విడతల మొత్తాన్ని ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి. గత ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను కొనసాగించాలి.
- యనమల రామకృష్ణుడు
నీతివంతమైన పాలన అందిస్తామని చెప్పుకుంటున్న బీజేపీ అడ్డగోలుగా ఎంపీలను చేర్చుకుంది. పార్టీలో చేరిన వెంటనే ఆ ఎంపీల పేర్లను రాజ్యసభ వెబ్ సైట్ లో చూపించడం బీజేపీ వ్యవహారశైలి ఎలాంటిదో చెబుతోంది. హోదా కోసం కేంద్రంతో పోరాడిన చంద్రబాబును ఇబ్బందిపెట్టేందుకే ఈ చర్యలు.
- దేవినేని ఉమ
టీడీపీని బలహీన పరిచే ప్రయత్నాలను తిప్పికొట్టాలి. బీజేపీ నేతలు అనుకుంటున్నట్టు టీడీపీ మునిగిపోయే నావ కాదు. - కొల్లు రవీంద్ర